ఏపీ మద్యం కుంభకోణం.. ఈడీ మెరుపు దాడులు!
Publish Date:Apr 25, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, తిరుపతిలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం (ఏప్రిల్ 24) ఉదయం నుంచే హైదరాబాద్, తిరుపతి, తాడేపల్లిలోని మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం పాలసీలో భారీ ఎత్తున అవినీతి తో పాటు.. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. దీంతో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సోదాల్లో గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, ఇతర అధికారులను ఈడీ టార్గెట్ చేసింది. కెసిరెడ్డి రాజశేఖర్ రడ్డి ఈ స్కామ్‌లో ఇతనే కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంలో భారీగా క్విడ్ ప్రో కో జరిగిందని, ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టించి, షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారనే కోణంలో ఈడీ ఆధారాలు సేకరిస్తోంది. ఇప్పటికే పలువురి నివాసాల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు మరియు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీలో సాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఈ ఈడీ మెరుపు దాడులు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
http://www.teluguone.com/news/content/ed-raids-in-ap-liquor-scam-36-218213.html





