డబ్బు, పొలం.. దస్తగిరికి అవినాశ్‌రెడ్డి గాలం.. ఎంపీపై సీబీఐకి ఫిర్యాదు..
Publish Date:Feb 22, 2022
Advertisement
ఎంపీ అవినాశ్‌రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే వివేకా హత్య కేసులో ఆయన కుట్ర ఉందంటూ సీబీఐ ఛార్జిషీటు ఫైల్ చేసింది. తనకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని అన్నందుకే.. వివేక హత్యకు కుట్ర చేసుంటారని సీబీఐ అంటోంది. తాజాగా మరింత షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నారు. అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని.. అవినాశ్‌రెడ్డి మనుషులు వెంటాడి.. వేధిస్తున్నారని.. డబ్బు, పొలం ఆశగా చూపించి.. విచారణ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారని.. నేరుగా సీబీఐకే ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది. గతేడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత.. సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పకుండా.. మభ్య పెట్టేందుకు, అతన్ని లొంగదీసుకునేందుకు వైసీపీకి చెందిన కొందరు అతన్ని సంప్రదించినట్టు.. దస్తగిరి సెప్టెంబరు 30న సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఆ కంప్లైంట్‌లో అవినాష్ రెడ్డికి సన్నిహితంగా ఉండే పులివెందులకు చెందిన భరత్ యాదవ్‌పై కీలక ఆరోపణలు చేశాడు. భరత్ యాదవ్ తరచూ తన ఇంటికి వచ్చే వాడని.. సీబీఐకి ఏయే వివరాలు చెప్పావు? ఏం స్టేట్‌మెంట్ ఇచ్చావు? ఆ వివరాలన్నీ అవినాష్‌రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి చెప్పాలంటూ తనను వేధిస్తున్నాడని సీబీఐకి ఫిర్యాదు చేశాడు దస్తగిరి. తాను.. సీబీఐ నిఘాలో ఉన్నానని, ఎక్కడికీ రాలేనని దస్తగిరి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, దస్తగిరి ఇంటి వెనుక ఉన్న పులివెందుల భాక్రాపురంలోని హెలిపాడ్ దగ్గరకు రమ్మని భరత్ యాదవ్ చెప్పడంతో అక్కడికి వెళ్లాడు దస్తగిరి. భరత్ యాదవ్‌తో పాటు ఓ లాయర్ అక్కడికి వచ్చి.. ఈ విషయాలు ఎక్కడా చెప్పొద్దని సూచించారని.. "నీకు 10-20 ఎకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇచ్చేందుకు ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు.. వివేకా హత్యకేసుకు సంబంధించిన విషయాలు సీబీఐకి చెప్పొద్దు.. ఇప్పటి వరకు సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పావో అవన్నీ మాకు చెప్పాలి" అంటూ.. తనను ఒత్తిడి చేసినట్టు దస్తగిరి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఆ తర్వాత మరోసారి కూడా భరత్ యాదవ్ తన ఇంటికి వచ్చాడని.. అవినాష్‌రెడ్డి తోట దగ్గరకు రావాలి, అన్న పిలుస్తున్నాడని చెప్పాడని దస్తగిరి చెప్పాడు. పులివెందులలో తాను ఎక్కడెక్కడ తిరుగుతున్నది.. ఎవరిని కలుస్తున్నది.. భరత్ యాదవ్ నిఘాపెట్టి ఫాలో అవుతున్నాడని.. తన ఫిర్యాదులో తెలిపాడు దస్తగిరి. సీబీఐకి దస్తగిరి ఇచ్చిన ఈ ఫిర్యాదు వివరాలు తాజాగా బయటకు రావడం సంచలనం రేపుతున్నాయి. అంటే, దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో అవినాశ్‌రెడ్డికి భయం పట్టుకుందని.. హత్యలో ఆయన కుట్ర లేకపోతే.. భరత్ యాదవ్‌తో అవినాశ్‌రెడ్డి ఎందుకు ఇంతలా దస్తగిరిని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడని అంటున్నారు. అంటే, వివేకా హత్య కేసు తన మెడకు చుట్టుకోకుండా.. దస్తగిరి తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకుండా.. అడ్డుకోడానికే అవినాశ్‌రెడ్డి ఇలా దస్తగిరిని వెంటాడి.. వేధించి.. డబ్బు, పొలం ఆశ చూపించాడని అంటున్నారు. ఇప్పటికే సీబీఐ విచారణలో అనేక సంచలనాలు వెలుగు చూస్తుండగా.. దస్తగిరి ఫిర్యాదు, సీబీఐ చార్జిషీటులో అవినాశ్‌రెడ్డి పేరు.. మరింత ప్రకంపణలు రేపుతున్నాయి.
http://www.teluguone.com/news/content/dastagiri-complaints-to-cbi-on-avinash-reddy-39-132153.html





