యూపీలో విపక్షం ఓటమి.. ఏపీ ప్రతిపక్షానికి గుణపాఠమా?
Publish Date:Mar 11, 2022
Advertisement
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలకు ఆస్కారం కల్పిస్తున్నాయి. అవును, యూపీ ఎన్నికలలో బీజేపీ గెలుపు పూర్తిగా అనూహ్యం కాకపోయినా, కొంతవరకు అనుహ్యమే. అంతే కాదు, యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఒక్క యూపీకీ, తప్పుడు లెక్కలతో పప్పులో కాలేసిన, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయత్వానికే కాదు, అదే తరహాలో, ప్రభుత్వ వ్యతిరేకతే తమకు పట్టం కడుతుందని, ఆశలు పెంచుకుంటున్న తెలుగు దేశం వంటి ప్రాంతీయ పార్టీలకు కూడా యూపీ ఫలితాలు గుణపాఠం కావాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజమే, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వానికి సమానంగా, లేదా కొంచెం ఎక్కువగానో, కొద్దిగా తక్కువగానో ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటోంది. అందులో సందేహం లేదు. అయితే, అదే సమయంలో ఎన్నికలలో అధికార పార్టీని ఓడించేందుకు ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే సరిపోతుందా? అంటే, సరిపోదని, ప్రతిపక్ష పార్టీ ఎన్నికలు దగ్గరకు వచ్చే వరకు నిద్రపోయి, ఎన్నికల ముందు లేచోస్తే, ప్రజల పట్టం కట్టరని చెప్పేందుకు యూపీ ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు పరిశీలకులు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ ( ఎస్పీ) అధినేత 2017 ఎన్నికల ఓటమి తర్వత సుమారు మూడేళ్ళు ముసుకుతన్ని పడుకున్నారే కానీ, ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయలేదు, అందుకే యూపీలో యోగీ ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి రెండవ సారి అధికారంలోకి రాగలిగిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే, యూపీ ఫలితాలు ( ఎస్పీ ఓటమి ) తెలుగు దేశం పార్టీకి ఒక గుణ పాఠం కావాలని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును గడచిన ఐదేళ్ళ పాలనలో, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, ప్రభుత్వం టన్నుల కొద్దీ, ప్రజా వ్యతిరేతను మూట కట్టుకుంది. యోగీ 2017లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే, గోరఖ్‌పూర్ (అప్పటికి యోగీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజక వర్గం) ఆసుపత్రిలో, కొద్ది రోజుల వ్యవధిలో సుమారు వంద మంది పిల్లలు, లిక్విడ్ ఆక్సిజన్ లేక చనిపోయారు. ఆ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక అది మొదలు కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో శవాలు గంగా నదిలో తెలియాడిన దుర్ఘటన వరకు, ముఖ్యమంత్రి యోగీ ప్రభుత్వంలో ప్రభుత్వ నిర్వాకం కారణంగా అనేక విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. యోగీ ప్రభుత్వం అనేక విధాల ప్రజాగ్రహాన్ని చవిచూసింది. యోగీ పాలన,రాష్ట్రంలో కాదు దేశంలో కూడా బీజేపీ ప్రతిష్టను దెబ్బ తీసింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలకు ఢిల్లీ సరిహద్దుల్లో, సంవత్సరం పైగా సాగిన ఆందోళనలో ఉత్తర ప్రదేశ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.లఖింపూర్ ఖేర్’ వద్ద ఆందోళన చేస్తున్న రైతుల మీదకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి కుమారుడి కారు దూసుకు వెళ్ళిన సంఘటనలు నలుగురు రైతులు సహా మొత్తం తొమ్మిది మంది చని పోయారు. అలాగే ‘ఉన్నావ్’ అత్యాచారం కేసు, ఇలా చెప్పుకుంటూ పొతే ఉత్తర ప్రదేశ్’ లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఐదేళ్లలో చేయని పాపం లేదని ప్రతిపక్షాలే కాదు, మీడియా కూడా చాల పెద్ద ఎత్తున యోగీ వ్యతిరేక ప్రచారం సాగించింది. మరో వంక ధరల పెరుగుదల నిరుద్యోగం, యువతలో అశాంతి, ఇంక అనేక రకాల వ్యతిరేకతలు. ఒక దశలో బీజేపీ కేంద్ర నాయకత్వమే యోగీకి ఉద్వాసన పలకాలనే నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలు ముందు, యోగీని పదవి నుంచి తప్పించే ప్రయత్నం బీజీపీ కేంద్ర నాయకత్వం చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో, ఇంతటి ప్రజవ్యతిరేకత నేపధ్యంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి ఎలా వచ్చిందంటే, ప్రత్యర్ధుల అతి విశ్వాసమే అందుకు కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షడు, మాజీ ముఖ్యమంత్రి ఆఖిలేష్ యాదవ్, యోగీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను చూసి మురిసి పోయారు. ఇంచు మించుగ మూడేళ్ళు నెత్తిన తడి గుడ్దేసుకుని హాయిగా పడుకున్నారు. ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్రయత్నం ఏదీ చేయలేదు. ఇక బీఎస్పీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి అసలే చివరి వరకూ కూడా గడప దాటలేదు. బీజేపే ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు రెండూ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ వ్యతిరేకతలనే నమ్ము కున్నారు. ఫలితం కళ్ళ ముందుంది. ఇక ఏపీ విషయానికి వస్తే, రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితి ఉందని సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు కుడా పార్టీ నాయకత్వం యూపీ ఫలితాలను ఒక గుణ పాఠంగా తీసుకుని, జూమ్ మీటింగులు, ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడంతో కాలక్షేపం చేస్తే, యూపీ ఫలితాలకు ఏపీ ఫలితాలు భిన్నంగా ఉండవని అంటున్నారు. నిజంగా కూడా తెలుగు దేశం పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్త పరుస్తున్న అభిప్రాయాలను పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకోవలసిన సమయం ఆసన్నమైందనేది మాత్రం నిజమని పరిశీలకులులే కాదు, పార్టీ సీనియర్ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. ఇక జనసేన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. పవన్ కల్యాణ్ ఫుల్ టైమ్ మూవీస్ చేస్తూ,. పార్ట్ టైమ్‌గా పాలిటిక్స్ చేస్తున్నట్టు ఉంది. అప్పుడప్పుడు అలా వచ్చి.. మెరుపు తీగలా.. జగన్‌కు ఝలక్ ఇచ్చి.. మాయమై పోతుంటారు. వచ్చినప్పుడు మాత్రం మామూలుగా ఉండదు మరి. ఆయనకు, ఫ్యాన్స్‌కు పూనకాలే. ఆ తర్వాత గప్‌చుప్. మళ్లీ మరోసారి పవర్ పాలిటిక్స్. ఇంతేనా? ఇక అంతేనా? జనసేనతో పోలిస్తే టీడీపీ.. చాలా చాలా బెటర్. చంద్రబాబు, లోకేశ్ లాంటి పెద్ద స్థాయి లీడర్లు నిత్యం వార్తల్లో, ప్రజల్లో ఉంటున్నారు. జగన్‌పై, వైసీపీ సర్కారు అరాచకాలపై ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు.. పోరాడుతున్నారు.. బాధితులకు మద్దతుగా నిలుస్తున్నారు. కాకపోతే కింది స్థాయి టీడీపీ నాయకులే.. తమకేమీ పట్టనట్టు ఇంట్లో పడుకుంటున్నారు. విజయవాడకు చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులు.. జేసీ, పరిటాల, చింతమనేని, అచ్చెన్న లాంటి వాళ్లు మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నారు. టీడీపీ అంతే ఇంతేనా? మిగతా టీడీపీ ద్వితియ శ్రేణి నాయకులంతా ఏమై పోయారు? ఇలాగైతే ఎలా? అంటున్నారు. యూపీలో సైకిల్ పార్టీకి పట్టిన పరిస్థితి.. ఏపీ సైకిల్‌కు రావొద్దంటే.. తమ్ముళ్లు యాక్టివ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని ప్రజాక్షేత్రంలో పోరాడాల్సి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/cycle-defeat-in-up-can-be-a-lesson-for-ap-cycle-39-132892.html





