యాక్షన్‌లోకి సీపీ స్టీఫెన్ రవీంద్ర.. రౌడీలకు జియో ట్యాగింగ్..
Publish Date:Oct 2, 2021
Advertisement
సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర పేరు ప్రకటించగానే అక్రమార్కులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అబ్బో.. స్టీఫెన్ వస్తే తమ ఖేల్ ఖతం దుకాణం బంద్.. అంటూ తెగ వర్రీ అయ్యారు. వాళ్లు అనుకున్నట్టే అవుతోంది. పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేరగాళ్లపై యాక్షన్ షురూ చేశారు. సింగం మూవీలో నరసింహ వలే.. రౌడీల భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్ పరిధిలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై ఉక్కుపాదం మోపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పోలీస్ స్టేషన్లో ఎంత మందిపై రౌడీషీట్ నమోదైంది? వారంతా ఎలాంటి నేరాలకు పాల్పడేవారు? తరచూ ప్రజలను ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్న వారెవరు? భూకబ్జాలు చేస్తున్నదెవరు? గంజాయి దందా జరుపుతున్నది ఎవరు? ఇలా ప్రాంతాల వారీగా నేరస్తుల జాబితాను సిద్ధం చేయాలని ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. నేరస్థులు, రౌడీషీటర్ల ఇండ్లు, వారి అడ్రస్‌లు, లొకేషన్స్‌ను.. జియో ట్యాగింగ్ చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్థులతో పాటు.. పాత రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులను ఎస్‌హెచ్‌వోలు విడతల వారీగా పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇకపై నేరాలకు పాల్పడినా, పద్ధతి మార్చుకోకపోయినా ఇబ్బందులు తప్పవని తమదైన స్టైల్లో వార్నింగ్ ఇస్తున్నారు. ఇక క్రైమ్ డిపార్ట్‌మెంట్‌పైనా స్పెషల్ ఫోకస్ పెట్టారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. స్టేషన్ల వారీగా దొంగల జాబితా దుమ్ము దులుపుతున్నారు. షాపులు కొల్లగొట్టేవారు, తాళం వేసిన ఇళ్లను దోచుకునేవారు, చైన్ స్నాచర్స్, డైవర్సన్ బ్యాచెస్.. ఇలా పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. నగరంపై పూర్తిస్థాయిలో పట్టు, అవగాహన ఉన్న అధికారి కావడంతో.. సైబరాబాద్‌ను మరింత పీస్ ఫుల్ సిటీగా మార్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు సీపీ స్పీఫెన్ రవీంద్ర.
http://www.teluguone.com/news/content/cyberabad-cp-stephen-ravindra-in-action-39-123921.html





