అనంతపురం- కడప రాకపోకలు నెల రోజులు బంద్! కూలిన పాపాగ్ని నది వంతెన..
Publish Date:Nov 20, 2021
Advertisement
రాయలసీమ జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. కుండపోత వర్షాలు కొంత తగ్గినా.. వరద ఉధృతి మాత్రం తీవ్రంగానే ఉంది. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో దాదాపు 6 వందల గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వాగులు, వంకలన్ని పొంగి పొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటుకు వందలాది వంతెనలు కుప్పకూలాయి. రహదారులైతే వందల కిలోమీటర్ల మేర ధ్వంసమయ్యాయి. సీఎం జగన్మోరన్ రెడ్డి సొంత జిల్లా కడపలో చరిత్రలో ఎప్పుడు లేనంతగా వరద వచ్చిందని అంటున్నారు. వరద ఉధృతికి కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన అర్ధరాత్రి కుప్పకూలింది. వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఏత్తివేయడంతో వరద నీరు పోటెత్తింది. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన.. శనివారం సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రాకపోకలు పునరుద్ధరించేందుకు నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరద పూర్తిగా తగ్గాకే మరమ్మత్తు పనులు చేపట్టడం వీలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారి అందుబాటులోకి రావడానికి నెల రోజులకు పైగానే సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/cuddapa-anantapur-roads-closed-for-one-month-due-to-bridge-collapsed-39-126809.html





