టీటీడీ ఈవో ధర్మారెడ్డీ నీకిక ‘సెలవు’!
Publish Date:Jun 11, 2024
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిని వారం రోజులు సాధారణ సెలవుపై వెళ్లాల్సిందిగా సీఎస్ నీరభ్ ప్రసాద్ ఆదేశించారు. జగన్ అడుగులకు మడుగులొత్తుతూ.. పదే పదే ఎక్స్టెన్షన్లతో టీటీడీ ఈవోగా కొనసాగుతున్న ధర్మారెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను వారం రోజులు సాధారణ సెలవుపై పంపారని చెబుతున్నారు. అయితే ఆయన తిరుపతి దాటి వెడితే వెళ్లొచ్చు కానీ, రాష్ట్రం దాటి వెళ్లడానికి వీల్లేదని నీరభ్ ప్రసాద్ స్పష్టంగా ఆదేశించారు. అసలు ఇంత హఠాత్తుగా ధర్మారెడ్డిని సెలవుపై పంపడానికి కారణమేమిటి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన తిరుమలేశుని సందర్శన సమయంలో ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా విధులలో ఉంటే ప్రొటోకాల్ ప్రకారం చంద్రబాబుకు ఆయన స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే ఈవో ధర్మారెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఆయన స్వాగతించడాన్ని పెద్దగా ఇష్టపడే అవకాశాలు లేవు. అది గ్రహించే సీఎస్ ఆయనను విధుల నుంచి తప్పుకుని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించి ఉంటారని అంటున్నారు. బుధవారం (జూన్12)న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం అదే రోజు ఆయన తిరుపతి వెడతారు. ఆ మరునాడు అంటే (జూన్ 13) గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జగన్ కు తైనాతీలుగా వ్యవహరించిన పలువురు అధికారులను విధుల నుంచి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. జగన్ చెప్పినట్లల్లా చేసిన జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా స్వయంగా చంద్రబాబే మౌఖికంగా ఆదేశించిన సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/cs-nirabh-prasad-orders-ttd-eo-go-on-leave-39-178313.html





