ముద్రగడ పరామర్శకు జగన్ ముఖం చాటేయడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
Publish Date:Jun 26, 2026
Advertisement
కాపు సామాజికవర్గ అగ్రనేత, కాపు ఉద్యమ కారుడు ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా.. 2024 ఎన్నికల్లో వైసిపి మళ్లీ గెలవకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని అప్పట్లో శపథం చేశారు. ఆ ఎన్నికలలో వైసిపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ముద్రగడ పద్మనాభం తన మాట నెరవేర్చుకుని తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగ మార్చుకున్నారు. 2024 ఎన్నికల ఘోర పరాభవం తర్వాత కూడా ఆయన జగన్ వెంటే నిలిచారు. జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. తన కోసం సర్వస్వం ఒడ్డిన నేతను చూడటానికి జగన్ స్వయంగా రాకుండా.. సజ్జల రామకృష్ణారెడ్డి పంపించడంపై వైసీపీయులలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న తన తండ్రిని చూడటానికి కూడా రాకుండా జగన్ ముఖం చాటేయడం దారుణమని విమర్శించారు. గతంలో ముద్రగడ చేసిన సేవలను, వైసిపి కోసం ఆయన పడ్డ కష్టాన్ని జగన్ విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నమ్మి వచ్చిన నేతలను జగన్ ఇలాగే నట్టేట ముంచుతారంటూ జగన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/criticism-mounts-over-jagan-shying-away-from-consoling-mudragada-39-224195.html





