నేరాంధ్రప్రదేశ్.. జగన్ పాలనలో 63% పెరిగిన నేరాలు..
Publish Date:Sep 15, 2021
Advertisement
అవును, ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్‌గా మారుతోంది. ఏపీలో క్రైమ్ రేట్ దారుణంగా పెరుగుతోంది. జగన్‌రెడ్డి పాలనలో నేరాలు-ఘోరాలు విపరీతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువవుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నది ఏ ప్రతిపక్షమో కాదు. ఇవన్నీ తాజా అధికారిక లెక్కల ప్రకారం.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన నిజాలు. ఆంధ్రప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరుగుతూ పోతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే 2020లో నేరాల సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా 63శాతం మేర క్రైమ్ రేట్ పెరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. జాతీయ స్థాయితో పోలిస్తే.. ఏపీ క్రైమ్ రేట్లో 23 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. 2019లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,45, 751 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐపీసీతో పాటు స్థానిక చట్టాల కింద నమోదైన కేసులు ఉన్నాయి. 2020లో కేసుల సంఖ్య 2,38,105కి చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే సుమారు లక్ష కేసులు అదనంగా నమోదైనట్టు. స్థానిక చట్టాలపై నమోదైన కేసులను తీసేసి.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను చూసినా 58 శాతానికిపైగా కేసులు పెరిగాయి. ఇది దేశంలోకే అత్యధిక వృద్ధి. భారత్‌లో అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 2019లో ఏపీ 12వ స్థానంలో ఉండేది. 2020 నాటికల్లా మరో మూడు స్థానాలు పెరిగి 9వ స్థానానికి చేరిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. తాజా నివేదికతో.. ఏపీ నేరాలకు అడ్డాగా మారిందనే విషయం మరోసారి స్పష్టమవుతోంది. పోలీసులంతా ప్రతిపక్షాలను టార్గెట్ చేసే పనిలో బిజీగా ఉంటే.. ఇదే ఛాన్స్ అంటూ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నపిల్లలు, దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. నేరం చేసినా వెంటనే శిక్ష పడదనే ధైర్యంతోనే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారని అంటున్నారు. తాడేపల్లి రే-ప్ కేస్ ఘటనలో నిందితులను వెంటనే పట్టుకోకపోవడం.. పలు అత్యా-చార ఘటనల్లో నిందితులను పట్టుకున్నా.. వెంటనే శిక్షించలేకపోవడం.. తదితర కారణాలతో క్రిమినల్స్‌లో భయం లేకుండా పోతోంది. శాంతిభద్రతల సంరక్షణలో ప్రభుత్వం, పోలీసుల వైఫల్యాన్ని తాజా నివేదిక ఎత్తి చూపిందని అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రతిపక్షాలపై ఫోకస్ కాస్త తగ్గించి.. క్రిమినల్స్‌పై దృష్టి పెడితే బాగుంటుందని.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్‌తోనైనా ఖాకీలు పద్దతి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/crime-rate-increased-in-ap-as-per-national-crime-records-bureau-39-123002.html





