ఆర్మీ డ్రెస్సులో మోదీ.. పీఎంఓకు కోర్టు నోటీసు
Publish Date:Feb 4, 2022
Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేషధారణ వస్త్ర ధారణ విషయంగా రాహుల్ గాంధి మొదలు కేసీఆర్ వరకు చాలా మంది నాయకులు చాలా సందర్భాలలో చాలా రకాల కామెంట్స్ చేశారు. అయితే అవ్వన్నీ రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలు. అయితే ఇప్పుడు, ప్రధాని మోడీ సైనిక దుస్తులు ధరించిన విషయంగా న్యాయస్థానం పీఎంఓకు నోటీసులు జారీ చేసింది. ఈనేపధ్యంలో మోడీ వస్త్రధారణ, మరో మారు చర్చనీయాంశమైంది. మోడీ 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో, ఎదో సందర్భంలో బంగారు తీగతో ఆయన పేరు (నరేంద్ర దామోదర్ దాస్ మోడీ) ‘పిన్ స్ట్రిప్’ చేసిన సూట్ ధరించారు. ఆ సూట్ విలువ రూ .10 లక్షలని ప్రచారం జరిగింది. ప్రధాని అంత ఖరీదైన సూట్ ధరించడం, అలాగే, లక్ష రూపాయల విలువైన మయ్బాచ్ ( Maybach ) సన్ గ్లాసెస్ ధరిచడం వివాదమైంది. అప్పట్లో రాహుల్ గాంధీ సూట్ ... బూట్ సర్కార్ అంటూ మోడీ సర్కార్’ను విమర్శించారు. అలాగే, రెండు మూడు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర బడ్జెట్ ఫై తమ స్పందన వినిపించేందుకు ఏర్పాటు చేసిన రికార్డ్ బ్రేకింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్’లో కూడా మోడీ వేష ధారణ, వస్త్ర ధారణ గురించి వ్యంగ్య బాణాలు స్పదించారు. ఈ ఇద్దరే కాదు, ఇంకా చాలా మంది చాలా రకాలుగా మోడీ వేషధారణ, వస్త్రధారణ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఒక్క మోడీనే కాదు, వస్త్రధారణ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న నాయకులు చాలామందే ఉన్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ధరించిన జాకెట్, ‘నెహ్రూ జాకెట్’ గా చరిత్రలో నిలిచి పోయింది. ఇప్పటికీ చాలా మంది రాజకీయ నాయకులు నెహ్రూ జాకెట్ ధరిస్తూనే ఉన్నారు. అలాగే, గాంధీ కట్టిన కొల్లాయి ... ‘కొల్లాయి కట్టితేనేమి మా గాంధి, కోమటై పుడితే నేమి మా గాంధీ’ కవితా రూపంగా చరిత్రలో నిలిచి పోయింది. అయితే, రాజకీయ నాయకుల వస్త్రధారణకు సంబంధించి, అదొక పార్శ్వం అయితే, ఇప్పుడు ఇంకో కోణం వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ, కశ్మీర్ పర్యటన సందర్భంగా, ఆర్మీ యూనిఫోరం ధరించడం వివాదస్పదం అయింది. వివాదస్పదం అవడమే కాదు, కోర్టు గడప కూడా తొక్కింది. ఇందుకు సంబంధించి, రాకేష్ నాథ్ పాండే అనే న్యాయవాది ,ఉత్తర ప్రదేశ్’లోని ప్రయాగ్ రాజ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్టులో , కోడ్ అఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ 156 (3) కింద పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ప్రయాగ్ రాజ్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి, నళినీ కుమార్ శ్రీవత్సవ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కు నోటీసు జారీ చేసింది. కాగా పిటీషనర్ తమ పిటీషన్’ లో సైనిక దుస్తులు ధరించడం, ఐపీసీ సెక్షన్ 140 కింద శిక్షార్హమైన నేరం అవుతుందని పేర్కొన్నారు. దీనిఫై పీఎంఓ ఏమి సమాధానం ఇస్తోందో చూడవలసి వుంది. అదలా ఉంటే, కేంద్ర మంత్రులపై ఉన్న అవినీతి కేసులు, అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుతం విదేశాల నుంచి వెనక్కి తెచ్చామని చేపుతున్న నల్లధనం వివరాలను బహిర్గతం చేయాలని కోరుతూ, ఐపీఎస్ మాజీ అధికారి సంజీవ్ థామస్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్’ పై సుప్రీంకోర్టు పీఎంఓకు మరో నోటీసు జారీ చేసింది. ఈ పిటీషన్ పై నాలుగు వారాల్లో సమధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు పీఎంఓను ఆదేసించింది.
http://www.teluguone.com/news/content/court-notice-to-pmo-on-modi-army-dress-39-131282.html





