చిత్తశుద్ధి లేని చింతన్ శిబిరాలు.. దార్శనికత కరవైన కాంగ్రెస్ అధినాయకత్వం!
Publish Date:May 14, 2022
Advertisement
కాంగ్రెస్ పార్టీ చింతన శివిర్ లో దేశానికి రాజకీయంగా ప్రత్యమ్నాయశక్తిగా ఎలా అవతరించాలో..ప్రజలకు అండగా ఉండడానికి..వారిలో నమ్మిక కలిగించడానికి ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలో చర్చ జరగాలి. గతంలో చేసిన తప్పిదాలను అంగీకరించి, వాటిని పునరావృతం కానివ్వబోమన్న సందేశాన్ని పార్టీ క్యాడర్ కే కాదు.. దేశ ప్రజలకు కూడా ఇవ్వగలగాలి. దేశానికి దిశ దశను చూపే దార్శనికతను ప్రదర్శించాలి. అది మాని కేవలం అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు సంధిస్తే సరిపోదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన ప్రసంగంలో కేవలం విమర్శలకే పరిమితమయ్యారు. బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని రూపొందించి జనంలోకి తీసుకువెళ్లగలిగిన నేతలు కాంగ్రెస్ లో కరవయ్యారు. విచిత్ర మేమంటే కాంగ్రెస్ పార్టీ తాను ఏమిచేయాలో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో నాయకుడిని ప్రతిపాదించే సాహసం పార్టీ అగ్రనాయకత్వంతో సహా ఎవరూ చేయలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. దేశ సమస్యలను ఆకళింపు చేసుకుని, వాటి పరిష్కారానికి మార్గాలను సూచించగలిగే సమర్థత గల నాయకత్వం కాంగ్రెస్ కు కొరవడింది. చింతన్ శిబిర్ లో అది ప్రస్ఫుటంగా గోచరించింది. వారసత్వ బలహీనత లనుంచీ, వంధిమాగధ గణం నుంచీ, కోటరీల స్వార్థ నేతలనుంచీ, వెన్ను పొట్ల సంస్కృతి నుంచీ, దళారులనుంచీ కాంగ్రెస్ తనను తాను బయటపడేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ మార్పు లేని జడత్వంలో కూరుకుపోతున్నది. దీంతో సమకాలీన రాజకీయాలలో ఉనికిని వేగంగా కోల్పోతోంది. ఈ బలహీనతలను పూర్తిగా వదిలించుకుని, మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ తనను తాను మరల్చుకోవలసిన అవసరం ఉంది. అయితే చింతన్ శిబిర్ లో నేతల ప్రసంగాలూ, పోకడలూ చూశాకా.. ఇప్పటికీ కాంగ్రెస్ పాత పద్ధతులను విడడానికి సిద్ధంగా లేదనీ, లోపాలను గుర్తించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం ససేమిరా అంటోందని అవగతమౌతుంది. దేశంలో ధరలు, నిరుద్యోగం, పెట్రో, గ్యాస్ ధరల పెంపు, జిఎస్టీ వాయింపులు, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించి.. వీటిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఏం చేస్తుందన్న ప్రణాళికలను ప్రజలకు వివరించాలి. అలాగే దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ఏం చేయబోతోందో చెప్పగలగాలి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, తనయ ప్రియాంకాగాంధీతో సహా హేమాహేవిూలందరూ చింతన్ శిబిర్ లో పాల్గొన్నారు. అయిదు రాష్టాల ఎన్నికల్లో పరాజయం చెందిన తర్వాత కాంగ్రెస్ నిజంగానే దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఇది తల్లీ కూతుళ్లకు, తల్లీ తనయులకు తెలియనివి కావు. పార్టీ అధిష్ఠానం ప్రజలతోనూ, కార్యకర్తలతోనూ సంబంధాలు కోల్పోయింది. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బిజెపితో రెండు యుద్దాలు చేసి ఓడి పోయింది. పోటీ చేసిన ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ఎన్నికలోనూ పార్టీ దెబ్బతింటూ వస్తోంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే సంపాదించింది. ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న బిజెపిని ఓడించే పరిస్థితులు ఉన్నప్పటికీ గెలిపించగల నాయకత్వం లేదని రుజువు చేసుకుంది. పంజాబ్‌లో ఆఖరి రోజుల్లో ముఖ్యమంత్రిని తొలగించి, ఆచరణ సాధ్యం కాని ప్రయోగాలు చేసి కుప్పకూలిపోయింది. ఇప్పటికీ కాంగ్రెస్ లో ప్రక్షాళనకు చిత్తశుద్ధితో అధిష్ఠానం ప్రయత్నించడం లేదని చింతన్ శిబిర్ లో నేతల ప్రసంగాలు రుజువు చేశాయి. బీజేపీని సమర్థంగా ఢీ కొకొనాలంటే కాంగ్రెస్ లేని కూటమి వల్ల సాధ్యం కాదని అందరూ నమ్ముతారు. అదే సమయంలో నమ్మి కాంగ్రెస్ తో కలిసే ధైర్యం మాత్రం ఏ పార్టీ చేయడం లేదు. ఒకప్పుడు రాజకీయ పార్టీలు బీజేపీని దూరంగా పెట్టేవి..ఇప్పుడా పరిస్థితి కాంగ్రెస్ కు వచ్చిందా అనిపిస్తున్నది. కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించి పార్టీ ప్రక్షాళన విషయంలో రాజీ లేకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
http://www.teluguone.com/news/content/congress-leadership-lack-of-vision-25-135895.html





