పనులు పూర్తి చేయండి.. డబ్బులివ్వం.. కోర్టుకెళ్లడానికి వీళ్లేదు.. ఏపీ టెండర్లలో షరతులు
Publish Date:May 31, 2022
Advertisement
మేం డబ్బులివ్వం.. అయినా మీరు కోర్టుకు వెళ్లడానికి వీల్లేదు.. ఏపీ సర్కార్ కాంట్రాక్టర్లకు విధించిన షరతు ఇది. పైగా ఈ షరతు టెండర్ పత్రాల్లోనే స్పష్టంగా పేర్కొంది. ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకోవాలనీ అంత వరకూ బిల్లుల గురించి ఒత్తిడి చేయడానికి వీల్లేదనీ స్పష్టం చేసింది. ముందు పనులు చేసేయండి, అవి పూర్తయ్యాకా ప్రభుత్వం వద్ద ఎప్పుడు డబ్బులుంటే అప్పడు ఇస్తాం అంటూ కాంట్రాక్టర్లకు షాక్ ఇచ్చింది. జల వనరుల శాఖ పనుల కోసం ఇచ్చిన టెండర్లలో విధించిన షరతులు, పెట్టిన నిబంధలను కాంట్రాక్టర్లను షాక్ కు గురి చేశాయి. ముందు పనులు చేసేయండి మా వీలును బట్టి ఎప్పుడో అప్పడు డబ్బులు ఇస్తామని చెప్పడమేమిటని కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ముందుకు రావడంలేదు. ఇప్పటికే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన లక్ష కోట్ల రూపాయల బిల్లలు పెండింగ్ లో ఉన్నాయని కాంట్రాక్టర్లు అంటున్నారు. వాటి చెల్లింపుల విషయంలో కూడా ప్రభుత్వం వివక్ష చూపుతోందనీ, ప్రాధాన్యతా క్రమంలో కాకుండా తమ వారికి మాత్రమే చెల్లింపులు చేస్తున్నారనీ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి పనులు పూర్తి కావాలన్న ఆలోచన లేదనీ, కొత్త టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పుకోవడానికి మాత్రమే ఇటువంటి కొత్త, వింత షరతులను ప్రభుత్వం పెడుతోందని వారంటున్నారు. చాలా మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదని కోర్టును ఆశ్రయించడం, కోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేయడం ఇప్పటి వరకూ పలు మార్లు జరిగిందనీ, దీంతో టెండర్ పత్రాలలోనే కోర్టుకు వెళ్లడానికి వీలు లేదన్న షరతు విధిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ షరతు విధించడమంటే పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావద్దని చెప్పడమేనని వారు అంటున్నారు. డబ్బులు ఎగ్గొట్టేందుకు, అప్పులు చేసేందుకు ప్రభుత్వం కొత్తకొత్త, వింత వింత విధానాలతో, షరతులతో ఎత్తులతో పడుతున్న తిప్పలు ఏపీని నవ్వుల పాలు చేసేవిగా ఉంటున్నాయని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/complete-works-dont-ask-money-new-rule-in-ap-tenders-25-136770.html





