బీసీ రిజర్వేషన్లు విషయంలో అన్ని ప్రయత్నాలు చేశాము : సీఎం రేవంత్
Publish Date:Aug 7, 2025
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్థాయిలో పోరాడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్ రాకుండా ప్రధాన మంత్రి మోదీ, హొం శాఖ మంత్రి అమిత్‌షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి ధర్నాలో బీఆర్‌ఎస్ ఎందుకు పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనకపోగా అవహేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇందుకోసం హైదరాబాద్ లో పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి కీలక సమావేశం నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది మా విధానం అని పార్టీ పరంగా ఇవ్వాలా, మరేదైనా ఉపాయం ఉందేమో పీఏసీలో చర్చిస్తామన్నారు. హైకమాండ్ అభిప్రాయంతో కోర్టులో వాదన వినిపిస్తామన్నారు. బిల్లులు, ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించకుంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పీఏసీ సమావేశంలో చర్చిస్తామన్నారు. నిన్నటి ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే రాలేదన్న వాదన అర్థరహితం అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అనుమానాలు ఉంటే అధికారిక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనకు అవగాహన కల్పిస్తామన్నారు. అన్ని కులాల వివరాలు సేకరించి కులగణన చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-39-203742.html





