ఇదెక్కడి దౌర్భాగ్యం! గాంధీజీకి నివాళి అర్పించని కేసీఆర్..
Publish Date:Oct 3, 2021
Advertisement
మహాత్మ గాంధీ.. భారతదేశ జాతిపిత.. బాపూజీ జయంతిని దేశమంతా పండుగలా నిర్వహిస్తారు. పల్లె నుంచి పట్నం వరకూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వేడుకలు జరుపుతారు. గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొని దేశ రాష్ట్రపతి, ప్రధాని వరకూ అంతా గాంధీజీకి నివాళి అర్పిస్తారు. బాపూజీ 152వ జయంతి సందర్భంగా శనివారం దేశమంతా వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని బాపూజీ సమాధి రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణా శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు నివాళులర్పించారు. దేశానికిమహాత్మా గాంధీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనను స్మరించుకున్నారు. దేశమంతా గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో మాత్రం మొక్కుబడిగా నిర్వహించారు. హైదరాబాద్ లోని బాపూఘాట్ వద్ద ప్రతి ఏటా సీఎం, ప్రజా ప్రతినిధులు, మేధావులు వచ్చి నివాళి అర్పించటం ఆనవాయితీ. ప్రతి ఏటా ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనేవారు. కాని ఈసారి మాత్రం గాంధీ జయంతిని తూతూమంత్రంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాపూఘాట్ కే రాలేదు. గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బాపూఘాట్ లో గాంధీజీకి నివాళి అర్పించారు. గాంధీకి నివాళి అర్పించడానికి కేసీఆర్ రాకపోవడంతో అందరిని షాక్ కు గురి చేసింది. గాంధీ జయంతి సందర్భంగా బాఫూఘాట్ కు రాని కేసీఆర్.. కనీసం ఇంట్లో అయిన నివాళి అర్పించినట్లుగా బయటకు సమాచారం లేదు. అంతేకాదు బాపు ఘాట్ లో మధ్యాహ్నం 12 గంటలకే ఏర్పాట్లను అధికారులు తొలగించారు. గాంధీ జయంతి రోజున ఆయన మ్యూజియంను మూసివేశారు. గాంధీ జయంతి రోజున టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జాతిపితకు నివాళి అర్పించడానికి సీఎం కేసీఆర్ బాపూఘాట్ రాకపోవడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. జాతిపిత గాంధీకి పూలదండ వేసే టైం కూడా సీఎం కేసీఆర్ కు లేదా…? అని కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. గాంధీని కేసీఆర్ అగౌరవ పరుస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సీఎంను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు.
http://www.teluguone.com/news/content/cm-kcr-miss-gandhi-jayanthi-event-in-bhapu-ghat-39-123942.html





