ఢిల్లీకి కేసీఆర్.. అందుకేనా?
Publish Date:Feb 24, 2022
Advertisement
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్. మూడు రోజుల పాటు హస్తినలోనే మకాం. కేంద్ర పెద్దలను కలిసే.. అధికారిక కార్యక్రమం కాదు. పక్కా ప్రైవేట్ ప్రోగ్రామ్. కీలక పొలిటికల్ మీటింగ్స్. ఢిల్లీపై దండెత్తడానికి ముందస్తు వ్యూహ రచన చేసేందుకే కేసీఆర్ హస్తిన పర్యటన లక్ష్యం అంటున్నారు. రాజధానిలో మకాం వేసి.. అక్కడి నుంచి బీజేపీని పారద్రోలే వ్యూహాలకు పదును పెట్టనున్నారని సమాచారం. బీజేపీపై కేసీఆర్ చేస్తున్నది ఉత్తుత్తి పోరాటమో.. లేక నిజమైన ఉద్యమమో క్లారిటీ లేకున్నా.. గులాబీ బాస్ మాత్రం సీరియస్‌గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశాల చుట్టూ తిరిగొచ్చారు. స్టాలిన్, నవీన్, ఠాక్రే, పవార్‌లతో మంతనాలు జరిపారు. ఇట్నుంచి ఫుల్ యాక్టివ్ ఉన్నా.. అట్నుంచి మాత్రం అంతంత మాత్రమే రియాక్షన్. ఇక, సౌత్ టూర్ మిగియడంతో.. ఢిల్లీ బాట పట్టారు కేసీఆర్. హస్తినలోనే ఉండి.. ఢిల్లీ నుంచి కమలనాథులను కదిలించేలా కసరత్తు చేయబోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈసారి హస్తిన పర్యటనలో పలువురు కీలక రాజకీయ నేతలను కలిసి చర్చించబోతున్నట్టు సమాచారం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కేసీఆర్ మీటింగ్ ఉంటుందని తెలుస్తోంది. కేంద్రంతో నిత్యం పోరాటం చేసే ముఖ్యమంత్రుల్లో అందరికంటే కేజ్రీవాల్ ముందుంటారు. ఆయన తర్వాతే.. మమతా అయినా.. కేసీఆర్ అయినా. అందుకే, మోదీ-బీజేపీపై పోరాటంలో కేజ్రీవాల్ సాయం కీలకమని భావిస్తున్నారు కేసీఆర్. మోదీ తీరును ఢిల్లీలోనే ఉండి గమనిస్తున్న కేజ్రీవాల్‌ను తనతో కలుపుకుని పోవాలనేది గులాబీ బాస్ స్కెచ్. కానీ, కేసీఆర్‌ను నమ్మేంత అమాయకుడేమీ కాదు కేజ్రీవాల్ అంటున్నారు. అందుకే, వారిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. ఇక, కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో పలు పార్టీల ముఖ్యనేతలను కలిసే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని ఇప్పటికే భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీ వేదికగా ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఈసారి తోకపార్టీలైన కమ్యూనిస్టు పెద్దలతోనూ కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు, కేసీఆర్ గతంలో చెప్పినట్టు.. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఢిల్లీలో కీలక చర్చలు జరుపుతారని అంటున్నారు. సివిల్ సర్వెంట్ల ఏకపక్ష బదిలీలకు వీలుకల్పించేలా.. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీని ఇప్పటికే సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రానికి ఘాటు లేఖలు కూడా రాశారు. ఇలా ఐఏఎస్, ఐపీఎస్‌ల సమస్యలతో పాటు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, మోదీ పాలనా తీరుపై మాజీ ఉన్నతాధికారుల నుంచి కీలక విషయాలు రాబట్టనున్నారు. ఇటీవల కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో.. ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు రాసిన పుస్తకంలోని అంశాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ బుక్‌ను సైతం మీడియా సమావేశంలో ప్రదర్శించారు. మోదీ వైఫల్యాల గురించి, దేశ ఆర్థిక తిరోగమనం గురించి అందరికంటే మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లకే బాగా తెలుస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే, ఈ హస్తిన పర్యటనలో రాజకీయ నేతలతో పాటు.. మాజీ సివిల్ సర్వెంట్స్‌తోనూ కీలక చర్చలు ఉంటాయని ఆ పార్టీ వర్గాల సమాచారం.
http://www.teluguone.com/news/content/cm-kcr-delhi-tour-updates-39-132232.html





