సర్వేలను నమ్ముకుంటే జగన్‌కు ఎదురైన పరిస్థితే... ట్రంప్‌లాగా ఎందుకు జరగదు?
Publish Date:May 30, 2017
Advertisement
2019లో అధికారం ఎవరిదన్న దానిపై కేసీఆర్, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ సర్వే బోగసన్న కాంగ్రెస్, బీజేపీ నేతలపై కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయని సర్వేలో తేలడంతో విపక్షాలకు బుర్ర పాడైందంటూ తన స్టైల్లో సెటైర్లు పేల్చారు. టీఆర్‌ఎస్ దెబ్బకు తెలంగాణలో అడ్రస్ లేని కాంగ్రెస్... కేడర్ లేని బీజేపీ కకావికలం అవుతున్నాయన్నారు. తమను రాజీనామాలు కోరే హక్కు ఎవరికీ లేదన్న కేసీఆర్.... కాంగ్రెస్ లీడర్లకు అంత ధీమా ఉంటే.... రిజైన్లు చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసిరారు. అంత పౌరుషం దమ్మూ ఉంటే రాజీనామా చేసి రండి.... ఆ సీట్లలో ఎవరు గెలుస్తారో చూద్దామంటూ కేసీఆర్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ నేతలపైనా కేసీఆర్ ఒంటి కాలిపై లేచారు. తమ సర్వే బోగస్ అంటున్న బీజేపీ లీడర్ల మైండే పెద్ద బోగస్ అంటూ ఫైరయ్యారు. సర్వేలపై నమ్మకం లేదంటున్న బీజేపీ నేతలు... సర్వేల్లో మోడీ గ్రాఫ్ పెరిగిందంటూ ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటూ రాని బీజేపీకి... వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుందంటూ కేసీఆర్ ప్రశ్నించారు. అయితే కేసీఆర్ సర్వేలపై సీఎల్పీ లీడర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కరించకుండా... రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలపై కేసీఆర్‌కి అప్పుడే తొందరెందుకంటూ చురకలంటించారు. తనకు సర్వేలపై నమ్మకం లేదన్న జానా... 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం మాత్రం ఖాయమన్నారు. అమెరికాలో ట్రంప్ గెలిచినట్లుగా.... ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పవర్‌లోకి వస్తుందన్నారు. మొత్తానికి రెండేళ్ల ముందే తెలంగాణలో ఎన్నికల వేడి రగిలింది. అయితే కేసీఆర్ చెబుతున్నట్లుగా టీఆర్‌ఎస్‌కి 111 సీట్లు వస్తాయనడం మాత్రం నమ్మశక్యంగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సర్వేలను నమ్ముకుంటే జగన్‌కు ఎదురైన పరిస్థితే ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/cm-kcr-45-75178.html





