మంచుకు 'మెగా' పంచ్.. 'మా' ఆగమాగం.. 'విష్ణు' చక్రం తిరిగేనా?
Publish Date:Oct 12, 2021
Advertisement
ఈ సినిమా వాళ్లున్నారే.. రాజకీయ నాయకులను మించిపోతున్నారు. అంతకుమించి రాజకీయం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకైనా అంతటి హంగామా ఉంటుందో లేదో కానీ, 'మా' ఎలక్షన్ మాత్రం క్షణక్షణం ఉత్కంఠతో హోరెత్తింది. పోలింగ్ నాడు రోజంతా సినీరాజకీయమే. అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులేమో నవ్వుతూ సెల్ఫీలు దిగారు. మిగతా ప్యానెల్ సభ్యులేమో తిట్టుకున్నారు.. కొట్టుకున్నారు.. కొరుక్కున్నారు.. రచ్చ రంభోలా చేస్తారు. 'మా' ఎన్నికను సినిమాటిక్ స్టైల్‌లో రక్తి కట్టించారు. అయితే.. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉండటంతో అంతా షాక్. 'మా' ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు బ్లాక్‌బస్టర్ విక్టరీ సాధించారు. ప్రకాశ్‌రాజ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే.. ప్రకాశ్‌రాజ్‌పై ఉన్నంత వ్యతిరేకత మిగతా ప్యానెల్ సభ్యులపై కనిపించలేదు. అందుకే, ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్‌ను పంతం పట్టి మరీ ఓడించారని తేలిపోయింది. నాగబాబు పదే పదే మద్దతు ప్రకటించినా.. ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడాన్ని మెగా ఫ్యామిలీ డైజెస్ట్ చేసుకోలేకపోతోందని తెలుస్తోంది. టాలీవుడ్‌లో మెగా కుటుంబం ఆధిపత్యాన్ని 'మా' ఫలితాలు సవాల్ చేసేలా ఉన్నాయంటున్నారు. అందుకే కాబోలు, తగ్గేదే లే.. అంటూ మెగా డైరెక్షన్‌లో ప్రకాశ్‌రాజ్ అండ్ టీమ్ రియల్ పాలిటిక్స్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే 'మా' సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్, నాగబాబులాంటి వాళ్లు రాజీనామా చేశారు. లేటెస్ట్‌గా ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ తరఫున గెలిచిన 11మంది తమ 'మా' పదవులకు రిజైన్ చేసి మరింత ట్విస్ట్ ఇచ్చారు. అధ్యక్షుడే ఓడిపోతే.. ఇక సైనికులు గెలిచినా విలువ, గుర్తింపు ఏముంటుంది? అందుకే.. అప్పటికప్పుడు వ్యూహం మార్చేసి.. అంతా మూకుమ్మడి రాజీనామాలు చేసేసి.. మంచు విష్ణుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని అంటున్నారు. ఇదంతా ఓ సినీ పెద్ద ఆదేశాల మేరకే.. అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము ఓడినందున.. గెలిచిన వారికి ప్రశాంతత లేకుండా చేసేందుకు.. 'మా' ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా.. పావులు కదిపారని విశ్లేషిస్తున్నారు. 'ఆత్మ' అనే పేరుతో 'మా'కు పోటీగా కొత్త ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేస్తారంటూ లీకులిచ్చారు. మొదట్లోనే విమర్శలు రావడంతో.. అంతలోనే ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ.. ఏవీ లేవంటూ ప్రకాశ్‌రాజ్‌తోనే చెప్పించారు. 'మా'లో గొడవలు రావొద్దనే సదుద్దేశంతోనే తాము పదవులకు రాజీనామా చేస్తున్నామని ప్రకటించి.. 'మా'లో ముసలం రాజేశారని అంటున్నారు. పనిలో పనిగా ప్రెస్‌మీట్లో అంతా కలిసి మోహన్‌బాబును విలన్‌గా చూపించే ప్రయత్నం బాగానే చేశారు. ప్రకాశ్‌రాజ్ ఆరోపించినట్టుగా.. క్రాస్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్‌లో అక్రమాలు, పోలింగ్ రోజు గొడవలు.. ఇవేవీ టెక్నికల్‌గా నిలబడవు. మంచు విష్ణు గెలిచారు. ఇదే నిజం. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక.. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలతో.. 'మా'.. సినిమాటిక్ టర్న్ తీసుకుంది. మరి, 'మా' క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో.. 'మా' తెరపైనే చూడాలి....
http://www.teluguone.com/news/content/cinematic-twists-in-maa-39-124461.html





