ఏపీలో మళ్ళీ మొదలైన అన్యమత ఆగడాలు.. జగనన్న అండతోనేనా?
Publish Date:Oct 8, 2021
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ లో అన్యమత ప్రచారం మళ్ళీ మొదటికొచ్చిందా? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండ చూసుకుని, క్రైస్తవ మత ప్రచారం మరింత ఊపందుకుందా? అంటే, కాదనే పరిస్థితి కనిపించడం లేదు. ఓ వంక విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రిఉత్సవాలు జరుగుతున్నాయి. జగన్మాత దుర్గామాతను దర్శించుకుని, అమ్మవారి ఆశీస్సులు అందుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. ఇలాంటి సమయంలో అదే ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా హిందూ మత ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ ప్రొజెక్టర్లో క్రైస్తవ ప్రార్థనల ప్రసారమయ్యాయంటే,అది మాములు తప్పిందం కాదు, మహా పాపం, మహా నేరం. ప్రభుత్వ పెద్దల అండదండలు ఆశీస్సులు లేకుండా, ఇలాంటి ‘తప్పిదం’ జరిగే అవకాశమే లేదని విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ రక్షణ సంస్థలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి. అయినా జగన్ రెడ్డి ప్రభుత్వంలో చలనం లేదు.. అధికారులలో కదలిక లేదు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవాలయం కార్యనిర్వహణ అధికారి, ఈవో జరిగిన సంఘటన పై దృష్టి సారించారుట ఎల్ఈడీ ప్రొజెక్టర్లో క్రైస్తవ ప్రార్థనల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా జరిందా? లేక పొరపాటున జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారుట.చివరకు భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దుర్గ గుడి ఘటనపై తెలుగు దేశం, బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ముందుగా దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు, రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు.. అన్యమత ప్రచారాలు పెరిగాయన్నారు.విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం చేస్తున్న హిందూధర్మ ప్రచార కార్యక్రమాల్లో క్రైస్తవ మత ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారని ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి అసలు హిందూ ధర్మం మీద ఏమాత్రం గౌరవం లేదని, హిందూ ధర్మ వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి నిత్యం ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా,పాలకుల అలసత్వం - అధికారుల నిర్లక్ష్యంతో అన్యమత ప్రచారానికి ప్రోత్సహిస్తున్నట్లుగా కనపడుతోందని శ్రీ సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు.'దేవాదాయ శాఖ మంత్రి ఇంటికి కూతవేటు దూరంలోనే అధికారులు ఇంత నిర్లక్ష్యమా? విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలలో అన్యమత ప్రచారాలను ప్రసారం చేయడానికి దేవాదాయశాఖ నిర్లక్ష్యమే పూర్తికారణం' అని బీజేపీ నేత విష్ణు వర్ధన రెడ్డి ఆరోపించారు. దీనికి బాధ్యులైన దేవాదాయ, ప్రభుత్వ సమాచార, పౌర సంబంధశాఖ అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/christian-songs-at-durga-temple--39-124236.html





