political-news-img

ఆపరేషన్ సిందూర్.. భారత దౌత్య, సైనిక పరాక్రమాల మేలు కలయిక!

సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో భారత్ చేపట్టిన అత్యంత సాహసోపేతమైన చర్యగా ఆపరేషన్ సిందూర్ నిలిచింది. గత ఏడాది మేలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు కేవలం యుద్ధ తంత్రాన్నే కాకుండా, అంతర్జాతీయ దౌత్య సమీకరణాలనూ సైతం మలుపు తిప్పాయి. పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన దాడికి ప్రతీకారంగా, భారత సైన్యం శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా వ్యూహరచన చేసింది. యుద్ధ రంగంలో సాంకేతికతను, దౌత్య రంగంలో చతురతను ప్రదర్శించి నిర్వహించిన ఆపరేషన్ సిందూర్.. దాయాది దేశాన్ని రక్షణ పరంగా ఆత్మరక్షణలో పడవేంది. దీనికి మూలం పహల్గామ్ ప్రాంతంలో మొదలైంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనే ఉగ్ర ముఠా దాదాపు 26 మంది వివాహితులైన హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకుని ఘాతుకానికి పాల్పడింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయడమే కాకుండా.. బాధితుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. దానిని ప్రతీకారంగా వివాహిత మహిళల మాంగల్యానికి ప్రతీక అయిన సింధూర్ ఈ ఆపరేషన్ పేరుగా ఎంచుకోవడం ద్వారా, ఆ వితంతువుల వేదనకు న్యాయం చేయాలనే భావోద్వేగ సందేశాన్ని కేంద్రం పంపింది. కేవలం గంటల వ్యవధిలోనే శత్రువులను కోలుకోలేని దెబ్బ తీయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం వైమానిక దాడులకు ఆదేశాలిచ్చింది. సైనిక వ్యూహాల్లో భాగంగా భారత్ తన అత్యాధునిక ఎస్-400 క్షిపణి వ్యవస్థను రంగంలోకి దించింది. దీనికి సుదర్శన చక్ర అని పేరు పెట్టడం ద్వారా అటు సైనిక శక్తిని, ఇటు సాంస్కృతిక ప్రతీకను కలిపి చూపింది. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలోని శత్రువుల విమానాలను, నిఘా వ్యవస్థలను ఈ క్షిపణి వ్యవస్థ నేలమట్టం చేసింది. భారత వైమానిక దళం పాకిస్థాన్ లోని కీలక సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంతో.. ఆ దేశ రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. గతంలో జరిగిన బాలాకోట్ దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ కంటే ఇది ఎంతో విస్తృతమైన, ఆధునికమైనదిగా పరిశీలకులు విశ్లేషించారు. యుద్ధ రంగంలోనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఆపరేషన్ సిందూర్ ఆసక్తికరమైన మలుపులను తెచ్చింది. భారత్ దాడులకు తలొగ్గిన పాకిస్థాన్, నష్టనివారణ కోసం అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగ ప్రవేశం చేసి.. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు కృషి చేశారు. అయితే ఈ సహాయం వెనుక పెద్ద రాజకీయ బేరసారమే జరిగింది. ఇరాన్ సంక్షోభం నుంచి అమెరికా గౌరవప్రదంగా తప్పుకోవడానికి పాకిస్థాన్ సహకరించడం, దానికి ప్రతిగా భారత్ నుంచి పాకిస్థాన్ కు ఉపశమనం లభించేలా ట్రంప్ వ్యవహరించడం ఒక వ్యూహాత్మక ఒప్పందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యక్తుల అహంకారం, అంతర్జాతీయ ప్రతిష్ఠలు కూడా దేశాల విదేశాంగ విధానాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ ఉదంతం నిరూపించింది. తనను తాను గొప్ప శాంతిదూతగా ప్రదర్శించు కోవాలనుకున్న ట్రంప్ కోరికను పాకిస్థాన్ పాలకులు షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించడం ద్వారా ఆయన మద్దతును పొంది, తద్వారా తమ దేశాన్ని సైనిక విపత్తు నుంచి కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది ఆధునిక కాలంలో నువ్వు నాకు సహాయం చేయి-నేను నీకు చేస్తాను' అనే తరహా దౌత్యానికి నిదర్శనంగా నిలిచింది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై భిన్నమైన విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. యుద్ధాన్ని ఒక సినిమా క్లైమాక్స్ లాగా మహిమాన్వితం చేయడం ప్రమాదకరమని కొందరు అంటుంటే.. యుద్ధం అంటే కేవలం విజయమే కాదు, దాని వెనుక అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాలు, శరణార్థుల సమస్యలు ఉంటాయనే వాస్తవాన్ని విస్మరించకూడదు. సింధూర్ వంటి భావోద్వేగపూరితమైన పేర్లను వాడటం ద్వారా ప్రజల సెంటిమెంట్లను రాజకీయాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సంక్లిష్టమైన దేశాల మధ్య సంబంధాలను అతి సరళీకృతం చేసి చూడటం వల్ల వాస్తవ పరిస్థితులు మరుగున పడే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ భవిష్యత్తులో భారత రక్షణ రంగానికి కొన్ని కీలక పాఠాలను నేర్పింది. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో.. అదే సమయంలో అంతర్జాతీయ చట్టాలను, ప్రాంతీయ స్థిరత్వాన్ని గౌరవించడం కూడా అంతే అవసరమని అంటున్నారు. సైనిక సాంకేతికతలో ముందంజలో ఉండటంతో పాటు, దౌత్యపరమైన మేధస్సును ప్రదర్శించడం ద్వారా మాత్రమే దేశ ప్రయోజనాలను కాపాడుకోగలమని ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. కేవలం ఆయుధ బలంతోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మిత్రదేశాలను సమన్వయం చేసుకోవడం కూడా విజయానికి కీలకమని అర్థమవుతోంది. ఆపరేషన్ సింధూర్' అనేది భారత చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోనుంది. ఇది దేశ భద్రత విషయంలో రాజీ లేని పోరాట పటిమను చాటింది. అయితే యుద్ధం అనేది ఎప్పుడూ చివరి మార్గంగానే ఉండాలని, శాంతిని నెలకొల్పడమే ప్రజాస్వామ్య దేశాల ప్రాథమిక లక్ష్యం కావాలని ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. రాబోయే రోజుల్లో భారత్ తన సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసుకోవడానికి, ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. శత్రువులకు హెచ్చరికగా నిలిచిన ఈ ఆపరేషన్, భవిష్యత్ వ్యూహరచనలో రక్షణ శాఖకు ఒక దిక్సూచిలా పనిచేయనుంది. - సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి

Publish Date: May 7, 2026 1:39PM

political-news-img

ఏపీలో ఏనుగులకూ ఆధార్!

ఆంధ్రప్రదేశ్ లో ఏనుగులకూ ఆధార్ తరహా గుర్తింపు కార్డులు జారీ కానున్నాయి. రాష్ట్ర అటవీ శాఖ ఏనుగులకూ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఏనుగుల సంరక్షణ కోసం ఏపీ అటవీశాఖ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది. ఆధార్ తరహా కార్డుల జారీ ప్రక్రియ కోసం ఇప్పటికే.. అధికారులు కుంకీ ఏనుగులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. సేకరించిన నమూనాలను తదుపరి విశ్లేషణ కోసం డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదికలు వచ్చిన వెంటనే కార్డుల జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు. కార్డులు కేవలం గుర్తింపు కోసమే కాకుండా ఏనుగుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయని చెబుతున్నారు.

Publish Date: May 7, 2026 1:16PM

political-news-img

కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోబోం.. స్టాలిన్ స్పష్టీకరణ

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాము అడ్డుకోబోమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రజల తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందన్న ఆయన.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు. అన్నాడీఎంకేతో కలిసి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోందంటూ జరుగుతున్న ప్రచారాన్నిన ఆయన కొట్టిపారేశారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదనీ, అవన్నీ వదంతులేనని స్టాలిన్ స్పష్టం చేశారు. కొత్త పార్టీ ప్రభుత్వ ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామన్నారు.

Publish Date: May 7, 2026 1:08PM

political-news-img

ఎక్స్ ఖాతా డీపీ మార్చుకున్న ప్రధాని మోడీ.. కొత్త డీపీ ఏంటంటే?

దేశ భద్రత విషయంలో రాజీ ప్రశక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అంతేకాకండా మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆ పోస్టులో కొనియాడిన ప్రధాని.. మన సైన్యం సాటిలేని ధైర్యం, కచ్చితత్వాన్ని ప్రదర్శించి పహల్గాం కుట్రదారులకు తగిన గుణపాఠం చెప్పిందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.

Publish Date: May 7, 2026 1:01PM

political-news-img

బెంగాల్ కోటపై కాషాయజెండా.. బీజేపీ విజయంపై ప్రపంచం దృష్టి

భారత రాజకీయ యవనికపై తూర్పు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ఒక అజేయమైన రాజకీయ దుర్గంగా నిలిచింది. దశాబ్దాల పాటు వామపక్షాలు, ఆపై దశాబ్దంన్నర పాటు తృణమూల్ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం వహించిన ఈ గడ్డపై బీజేపీ తొలిసారిగావిజయం సాధించడం జాతీయ రాజకీయాల్లోనే అతిపెద్ద మలుపుగా నిలిచింది. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందన్న నినాదం ఈ విజయంతో నిజమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ లో బీజేపీ సాధించిన ఈ ఘన విజయం.. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలకే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా అభివర్ణించారు. ప్రజల శక్తికి ఇది నిదర్శనమన్న ఆయన.. సుపరిపాలన వైపు బెంగాల్ అడుగులు వేస్తోందని చెప్పారు. మూడు దశాబ్దాల కమ్యూనిస్ట్ పాలనను, ఆపై సుదీర్ఘకాలం సాగిన మమతా బెనర్జీ ప్రాబల్యాన్ని తట్టుకుని బీజేపీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడం సామాన్య విషయం కాదు. ఇది తూర్పు భారత దేశంలో బీజేపీ రాజకీయ యాత్రకు ఒక బలమైన పునాదిగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విజయంపై స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకత్వం భారతదేశానికి ఉండటం ఆ దేశ ప్రజల అదృష్టమని ఆయన ప్రశంసించారు. గ్లోబల్ లీడర్ల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు మరియు స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ రాజకీయాలు ఈ స్పందనలో ప్రతిబింబించాయి. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితంపై అగ్రరాజ్య అధినేత స్పందించడం అనేది అంతర్జాతీయ స్థాయిలో మోదీ బ్రాండ్ ఇమేజ్ ఎంతగా విస్తరించిందో స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ విజయంపై విశ్లేషణలు వెలువరించాయి. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక హిందూ నేషనలిస్టులు ప్రతిపక్ష కోటను జయించారు అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. భారతదేశాన్ని తనదైన శైలిలో మార్చాలనే మోదీ దీర్ఘకాలిక లక్ష్యంలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా అభివర్ణించింది. ఇక పోతే బ్రిటిష్ వార్తా సంస్థ ది గార్డియన్ బీజేపీ ఆధిపత్యానికి చిట్టచివరి అడ్డంకిగా ఉన్న బెంగాల్ పతనం కావడం.. బలహీనపడుతున్న ప్రతిపక్షానికి మరో పెద్ద దెబ్బగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా బెంగాల్ ఫలితాలను భారత ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఒక భారీ మార్పుగా చూస్తున్నారు. బీబీసీ తన విశ్లేషణలో బెంగాల్‌ను అత్యంత కఠినమైన రాజకీయ సరిహద్దు గా పేర్కొంది. మోదీ పాలనలో ఇది అత్యంత కీలకమైన గెలుపనీ, తూర్పు భారత్ నుంచి దేశంపై పూర్తి స్థాయి పట్టు సాధించడానికి బీజేపీకి ఇది మార్గం సుగమం చేసిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలో కూడా ఈ ఫలితంపై కథనాలు, విశ్లేషణలూ వెలువడ్డాయి. పాకిస్తాన్‌కు చెందిన డాన్ వంటి పత్రికలు బీజేపీని నేషనలిస్ట్ పార్టీగా అభివర్ణిస్తూ.. బెంగాల్‌లో ఆ పార్టీ విజయం సరిహద్దు భద్రత, ప్రాంతీయ సమీకరణాలపై చూపే ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా సరిహద్దు సమస్యలు, శరణార్థుల అంశాలపై బీజేపీ తీసుకోబోయే కఠిన నిర్ణయాలు దక్షిణాసియా రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషించాయి. ఆర్థిక కోణంలో చూస్తే, సిటీ వంటి గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు ఈ విజయాన్ని రాజకీయ సుస్థిరతకు సంకేతంగా పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ సమన్వయంతో పనిచేయడం వల్ల సంస్కరణల అమలు వేగవంతం అవుతుందని.. ఇది పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని అంచనా వేస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో ఎన్నికల ప్రక్రియలో జరిగిన కొన్ని పరిణామాలు, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి ఆరోపణలను కూడా అంతర్జాతీయ మీడియా ప్రస్తావించింది. సుస్థిరతతో పాటు సామాజిక ఐక్యతను కాపాడటం బీజేపీ ముందున్న అతిపెద్ద సవాలుగా నిలుస్తుంది. ఈ చారిత్రాత్మక మార్పు భారత ఫెడరల్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలోనూ, అత్యధిక రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ ఆధిపత్యం కొనసాగినప్పుడు రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై ఒత్తిడి పెరుగుతుందా లేక అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అలాగే, జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతుందా అనే అంశాన్ని అంతర్జాతీయ మేధావులు ప్రస్తావిస్తున్నారు.మొత్తం మీద బెంగాల్ లో బీజేపీ విజయం కేవలం ఓట్ల గణితం మాత్రమే కాదు.. భారత సమాజంలో వస్తున్న రాజకీయ మరియు సాంస్కృతిక మార్పుకు ప్రతిబింబంగా నిలిచిపోనుందని పరిశీలకులు అంటున్నారు. - సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి. షేర్ చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Publish Date: May 7, 2026 12:12PM

political-news-img

బెంగాల్, కేరళలో బీజేపీ రాజకీయ ప్రస్థానం.. సవాళ్లు, విజయాలు

భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పటిష్టమైన శక్తిగా ఎదిగినప్పటికీ, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రయాణం అనేక ఒడిదుడుకులతో కూడుకుని ఉంది. విజయాల కంటే పరాజయాలనే ఎక్కువగా చవిచూసిన చరిత్ర ఉన్నప్పటికీ.. పట్టువదలకుండా తన ఉనికిని చాటుకోవడం ద్వారా ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఒక కీలక రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కేరళలో పరిమిత విజయాలు ఉన్నప్పటికీ, బెంగాల్‌లో సాధించిన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. దక్షిణ రాష్ట్రమైన కేరళలో బీజేపీకి అధికార పీఠం ఇప్పటికీ అందనంత దూరంలోనే ఉంది. అయినప్పటికీ, గత కొన్ని ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే అక్కడ పార్టీ ఓటు శాతం క్రమంగా పెరుగుతోంది. వామపక్షాలు, కాంగ్రెస్ కూటములు బలంగా ఉన్న కేరళలో, మైనారిటీ ఓట్ల సమీకరణలు, స్థానిక సామాజిక పరిస్థితులు బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. కానీ.. వ్యవస్థలోని అన్ని శక్తులు తమకు వ్యతిరేకంగా ఉన్నా.. ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగామనే వాదనను పార్టీ బలంగా వినిపిస్తోంది. సున్నా నుంచి మొదలైన తమ ప్రయాణం.. భవిష్యత్తులో కేరళ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పునకు సంకేతమని ఆ పార్టీ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, అక్కడ బీజేపీ సాధించిన వృద్ధి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. దశాబ్దాల పాటు సాగిన వామపక్షాల పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ హవాను తట్టుకుని బీజేపీ తాజా ఎన్నికలలో విజయం సాధించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 శాతం ఓట్లతో ఒక్క సీటు కూడా గెలవలేని స్థితి నుంచి.. 2021 నాటికి 38 శాతం ఓట్లు, 77 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ.. 2026 అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందనడంలో సందేహం లేదు. ఈ ఎదుగుదల కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదనీ, బెంగాలీ ప్రజల ఆత్మగౌరవం మరియు దేశ భద్రతకు సంబంధించిన విషయమనీ బీజేపీ ప్రచారం చేస్తోంది. బెంగాల్ రాజకీయాల్లో హింస అనేది ఒక విడదీయలేని భాగంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. కమ్యూనిస్టుల హయాం నుండీ రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, బూత్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, కేవలం పార్టీల పేర్లు మాత్రమే మారాయని బీజేపీ విమర్శిస్తోంది. 2021 ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే, బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ హింసను అతిశయోక్తిగా చూపించిందని తృణమూల్ కొట్టిపారేసింది. బెంగాల్ రాజకీయ సంస్కృతిలోనే హింస పాతుకుపోయిందని, దీనికి అన్ని పార్టీలు బాధ్యత వహించాలని స్వతంత్ర విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ ఎదుగుదల వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పాత్ర అత్యంత కీలకంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా పని చేయడం.. బూత్ స్థాయి కార్యకర్తలను తయారు చేయడం, సామాజిక-సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వడం వంటి వ్యూహాలను ఆర్ఎస్ఎస్ అమలు చేస్తోంది. ముఖ్యంగా బెంగాలీ ఐడెంటిటీని పెంచేలా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వారసత్వాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించి దగ్గరైంది. అయితే.. ఇటువంటి చర్యలు సమాజంలో మతపరమైన ధ్రువీకరణకు దారితీస్తాయనే విమర్శలు వినవస్తున్నాయి. అది వేరే సంగతి. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించిన సోనార్ బంగ్లా (బంగారు బెంగాల్) నినాదం ప్రజల్లో భారీ అంచనాలను పెంచింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, చొరబాటుదారుల నియంత్రణ వంటి అంశాలతో కూడిన ఈ వాగ్దానం ఓటర్లను ఆకర్షించింది.అధికారంలోకి రావడానికి దోహదం చేసింది. అయితే ఈ భారీ వాగ్దానాల అమలు బీజేపీ ఇప్పుడు బీజేపీ ముందున్న అతిపెద్ద సవాలు అనడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే.. బెంగాల్, కేరళలో బీజేపీ ఎదుగుదల అనేది భారత రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. భావోద్వేగపూరితమైన నినాదాలు ఒకవైపు శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందించడం, హింసకు తావులేని రాజకీయ వాతావరణాన్ని నిర్మించడం అనేది అసలైన పరీక్షగా మారుతుంది. కేవలం ఎన్నికల్లో సీట్లు పెంచుకోవడమే కాకుండా.. ఆయా రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో సానుకూల మార్పులు తీసుకురాగలిగితేనే ఈ ప్రస్థానానికి సంపూర్ణ అర్థం లభిస్తుంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రాల్లో బీజేపీ తన ప్రభావాన్ని ఎలా కొనసాగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. - సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి.

Publish Date: May 7, 2026 11:49AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img