చంద్రయ్య పాడె మోసిన చంద్రబాబు.. జగన్, పిన్నెల్లికి స్ట్రాంగ్ వార్నింగ్
Publish Date:Jan 13, 2022
Advertisement
చంద్రయ్య పాడె మోసారు చంద్రబాబు. చనిపోయిందేమీ ఆయన కుటుంబ సభ్యుడు కాదు. నారా ఫ్యామిలీనో, నందమూరి ఫ్యామిలీనో అస్సలు కాదు. మృతుడు తెలుగుదేశం కుటుంబ సభ్యుడు. పసుపు జెండాను నమ్ముకున్న నిఖార్సైన కార్యకర్త. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు. వైసీపీ దౌర్జన్యాలకు, గుండాలకు వ్యతిరేకంగా ధీటుగా పోరాడుతున్న తెలుగు తమ్ముడు. అదే అధికార పార్టీ రౌడీలకు కంటగింపుగా మారింది. తమకు ఎదుర్కొని నిలుస్తున్నాడనే కడుపుమంటతో టీడీపీ నేత చంద్రయ్యను గ్రామం మధ్యలో, నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే.. దారుణంగా చంపేశారు. హత్యా రాజకీయాలతో నెత్తుటి మరక చిందించారు. మరో నిండు ప్రాణం బలిగొన్నారు. తోట చంద్రయ్యని చంపింది వైసీపీ నాయకులు చింతా శివరామయ్య, చింతా ఆదినారాయణ. ఇందులో చింతా శివరామయ్య ఎంపీపీగా ఉన్నాడు. అతను ఎమ్మెల్యే పిన్నెల్లికి రైట్ హ్యాండ్ లాంటోడు. పల్నాడులో పిన్నెల్లి రౌడీ మూక ఇలానే దాడులతో రెచ్చిపోతోంది. గతంలో బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై హత్యాయత్నం చేసిన తురకా కిషోర్ సైతం పిన్నెల్లి బ్యాచ్ రౌడీ మూకకు చెందిన వాడే. అలాంటి అరాచకవాది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులైన చింతా శివరామయ్య, చింతా ఆదినారాయణలే ఇప్పుడు టీడీపీ నేత తోట చంద్రయ్యను దారుణంగా హతమార్చారు. విషయం తెలిసి టీడీపీ అధినేత చంద్రబాబు గుండ్లపాడు తరలివెళ్లారు. హత్యకు గురైన తోట చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రయ్య అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. చంద్రబాబు అంతటివారే ఇలా పాడె మోయడంతో అక్కడున్న టీడీపీ శ్రేణులంతా చలించిపోయారు. చంద్రయ్య భార్య కోటమ్మ, కుమారుడు ఆంజనేయులును అంతా ఓదార్చారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 25 లక్షలు ఆర్థిక సాయం అందించారు. చంద్రయ్య హత్యపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ‘‘అధికారం, పదవులు ఎవరికీ శాశ్వతం కాదు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం. మాచర్లలో ఏం జరిగినా కార్యకర్తలకు అండగా ఉంటాం. బ్రహ్మారెడ్డి రాకతో మాచర్ల వైసీపీలో వణుకు మొదలైంది. జగన్ మోహన్‌రెడ్డి నీ మనుషుల్ని కంట్రోల్ చేసుకో.. లేకుంటే మీరే బాధ్యులు. రాష్ట్రాన్ని హత్యా రాజకీయాలతో నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు వైసీపీ నాయకులు 33 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఒక్క గురజాలలోనే 9మందిని చంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఖబడ్దార్.. మాచర్ల మీ జాగీర్ కాదు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బొండా ఉమా, బుద్దా వెంకన్నపై దాడి చేసిన రౌడీకి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తావా పిన్నెల్లీ. మీ సామ్రాజ్యంలో ప్రజాస్వామ్యం స్థాపించేందుకే వచ్చా. కార్యకర్తలూ రెండేళ్లు ఓపిక పట్టండి’’ అంటూ వైసీపీని హెచ్చిరిస్తూ.. టీడీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు.
http://www.teluguone.com/news/content/chandrababu-strong-warning-to-jagan-and-pinnelli-on-chandraiah-murder-39-130190.html





