కడప నుంచి విమాన సర్వీసులు నడపండి! సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ..
Publish Date:Oct 10, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప. గత టీడీపీ హయాంలో కడప విమానాశ్రయాన్ని అధునీకరించారు. 2018లో కడప ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని రోజులుగా కడప నుంచి విమాన సర్వీసులు నడవడం లేదు. దీంతో వ్యాపారులు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం జగన్ సొంత గడ్డ నుంచే విమాన సర్వీసులు ఆగిపోవడంపై జనాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కడప విమానాశ్రయం నుంచి సర్వీసులు నిలిచిపోవడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. టీడీపీ హయాంలో టయర్ 2, టయర్ 3 నగరాల మధ్య విమాన సర్వీసులను ఏర్పాటు చేశామని, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఉడాన్ స్కీమ్ ను అమలు చేశామని తన లేఖలో చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు విమాన సర్వీసులుండేవని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సర్వీసులు ఆగిపోయాయన్నారు. కడప నుంచి వేరే ప్రాంతాలకు విమానాలను నడపాలని కోరుతూ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. గతంలో కడప నుంచి హైదరాబాద్, విజయవాడకు విమానంలో వెళ్లాలంటే తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేదని చంద్రబాబు గుర్తు చేశారు. దాని వల్ల సమయం వృథా అయ్యేదని, ఖర్చు కూడా ఎక్కువేనని చెప్పారు. ఆ ఇబ్బందులను తప్పించేందుకే 2018లో కడప నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కడప నుంచి విమాన సర్వీసులను నిలిపేశారని, దీంతో వ్యాపారులే కాకుండా సామాన్య ప్రయాణికులూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు, వీలైనంత త్వరగా కడప నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
http://www.teluguone.com/news/content/chandrababu-letter-to-cm-jagan-over-cuddapa-airport-39-124336.html





