72 ఏళ్ల నవ యువకుడు.. హ్యాపీ బర్త్‌డే చంద్రబాబు..
Publish Date:Apr 19, 2022
Advertisement
నారా చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి సీఎం. ఆంధ్రుల అభిమాన ప్రజా రాజధాని అమరావతి నగర సృష్టికి ప్రధాన ఆర్కిటెక్ట్. రాజధాని కూడా లేకుండా అన్యాయంగా ఏపీని ముక్కలు చేసినప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే భారాన్ని కించిత్ భయం కూడా లేకుండా భుజాన వేసుకున్న ధీరోదాత్తుడు. రాజకీయ రంగంలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఆంధ్రుల జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుని, పనుల్ని పరుగులు పెట్టించిన కార్యదక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం దేశ విదేశాల నుంచి ఎన్నెన్నో పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చిన కార్యశీలి. రాష్ట్రానికి అత్యధిక కాలం ప్రజా రంజక పాలన కొనసాగించిన సీఎం. అలాంటి డైనమిక్ రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడి 72వ పుట్టిన రోజు. నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో రైతు కుటుంబంలో జన్మించారు. నారా ఖర్జూరనాయుడు- అమ్మణమ్మ ఆయన తల్లిదండ్రులు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు రెండో కుమార్తె భువనేశ్వరి ఆయన సతీమణి. ఎమ్మెల్సీ లోకేష్ ఆయన కుమారుడు. చంద్రబాబు 5వ తరగతి వరకు శేషాపురంలోను, చంద్రగిరి హైస్కూల్ లో పదో తరగతి వరకు చదివారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజిలో 1972లో చంద్రబాబు బీఏ పూర్తిచేశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1974లో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ పట్టా తీసుకున్నారు. చంద్రబాబులో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు వెలుగు చూశాయి. ఎస్వీ వర్శిటీలో 1975లో ఎంఏ చదువుతున్నప్పుడు చంద్రబాబు విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు యూత్ కాంగ్రెస్ లో చేరారు. 1975లో ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆమె రెండో కొడుకు సంజయ్ గాంధీకి మద్దతుగా నిలిచారు. సంజయ్ గాంధీతో చంద్రబాబు నాయుడికి అత్యంత సాన్నిహిత్యం ఉండేది. ఎన్జీ రంగా సహాయంతో 1978లో తన 28 ఏళ్లకే చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఏపీ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా చంద్రబాబు సేవలందించారు. తర్వాత టి. అంజయ్య కేబినెట్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడే 1980లో ప్రముఖ నటుడు నటరత్న ఎన్టీ రామారావుతో చంద్రబాబు నాయుడికి పరిచయం ఏర్పడింది. ఆయన రెండో కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబు వివాహం జరిగింది. 1982లో ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి, రికార్డు సమయం 9 నెలల్లోనే 1983లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, అధికారంలోకి వచ్చారు. విశాఖపట్నంలో జరిగిన టీడీపీ రెండో మహానాడులో చంద్రబాబు ఆ పార్టీలో చేరారు. 1984లో సీఎం ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా నాదెండ్ల భాస్కరరావు చేసిన తిరుగుబాటును తిప్పికొట్టిన చంద్రబాబులోని రాజకీయ చతురత, చాణక్యం బయటపడ్డాయి. చంద్రబాబు కృషిని మెచ్చుకుని ఎన్టీరామారావు టీడీపీ కర్షక పరిషత్ కు ఇన్ చార్జిగా నియమించారు. తర్వాత టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి టీడీపీలో చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషించారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకుండా టీడీపీని మరింత బలంగా నిర్మించే బాధ్యత భుజస్కంధాలపై వేసుకున్నారు. 1989 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు టీడీపీ కో ఆర్డినేటర్ గా నియమితులై.. అసెంబ్లీలో ప్రతిపక్షంగా టీడీపీని నడిపించడంలో తన నేర్పరితనాన్ని ప్రదర్శించారు. అప్పుడే చంద్రబాబు అటు పార్టీ నుంచి ఇటు ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1994లో కుప్పం నుంచి మళ్లీ ఎన్నికైన చంద్రబాబు ఈసారి ఎన్టీఆర్ కేబినెట్ లో ఆర్థిక, రెవెన్యూ శాఖలను సమర్థవంతంగా నిర్వహించి తానేంటో నిరూపించుకున్నారు. 1995 సెప్టెంబర్ లో చంద్రబాబు తొలిసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నికై 1999 వరకు ఆ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు. టీడీపీకి గడ్డుకాలం ఎదురైనప్పుడు చంద్రబాబు సీఎం పదవిని చేపట్టాల్సి వచ్చింది. తొలిసారి సీఎం అయిన చంద్రబాబు గ్రామీణ మహిళలకు 100 కోట్లతో ‘దీపం’ పథకం ప్రవేశపెట్టి, వేలాది మందికి గ్రాస్ కనెక్షన్లు ఇచ్చారు. 1999లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ 294 సీట్లకు గాను మొత్తం 185 స్థానాల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చి, రెండోసారి ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు 1996లో రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమం ప్రారంభించారు. 1997లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజలు తమ సమస్యలపై నేరుగా సీఎంతో మాట్లాడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లతో అటు రైతులు, ఇటు వినియోగదారులు ఎంతో ప్రయోజనం పొందారు. 2001లో ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు 1999లో ‘విజన్ 2020’ ద్వారా ఏపీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కలలుగన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోని బ్ఎయిర్ హైదరాబాద్ సందర్శించారు. చంద్రబాబు తన విజన్ ద్వారా హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించారు. దాంతో దేశ విదేశాల్లోని అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ లోనే చంద్రబాబు 1999లో ఫార్మాసిటీని ఏర్పాటు చేశారు. శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2003లో చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రారంభమైంది. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతి సారీ లెక్కకు మించి ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. రెండుసార్లు వరుసగా విజయాలు సాధించిన టీడీపీ 2009 ఎన్నికల్లో ఓటమి చెంది చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు 2014లో ఏపీ తొలి సీఎంగా ఎన్నికయ్యారు. 2015 అక్టోబర్ 22న ఏపీ తొలి సీఎంగా చంద్రబాబు ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని నగరాన్ని అమరావతి పేరుతో నిర్మాణం చేపట్టారు. ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాని నరేంద్ర మోడీతో అమరావతి రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. ప్రజా రాజధాని కోసం భూమి కావాలని చంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపుతో రైతులు 33 వేలకు పైగా ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ చేసిన టక్కు టమార, గజకర్ణ గోకర్ణ విద్యలతో మరోసారి టీడీపీ ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తూ ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/chandrababu-happy-birth-day-39-134641.html





