భారత నావికులకు కేంద్రం అలర్ట్: హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణాలపై నిషేధం.!
Publish Date:Jul 16, 2026
Advertisement
గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు నానాటికీ క్షీణిస్తుండటంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా అత్యంత రద్దీగా ఉండే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల్లో భారతీయ నావికుల నియామకంపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) అన్ని అంతర్జాతీయ నౌకా యజమానులకు, షిప్ మేనేజ్‌మెంట్ సంస్థలకు, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారతీయ సిబ్బందిని ఈ మార్గంలో పంపరాదని విస్పష్టంగా పేర్కొంది. గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించిన భారత ప్రభుత్వం, ఇండియాకు చెందిన నావికుల ప్రాణ రక్షణ, భద్రత, సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యతగా భావించి ఈ తాత్కాలిక నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో, ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ మరియు, జలసంధి ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న నౌకల కెప్టెన్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ నౌక, నౌకాశ్రయ భద్రతా నియమావళి నిబంధనలకు అనుగుణంగా తయారు చేసిన ప్రత్యేక భద్రతా ప్రణాళికలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. సముద్ర మార్గంలో ప్రయాణించే సమయంలో అంతర్జాతీయ భద్రతా అలర్ట్‌లను నిరంతరం నిశితంగా గమనిస్తూ ఉండాలని సూచించింది. ఇండియా నుండి వేల సంఖ్యలో నావికులు అంతర్జాతీయ వాణిజ్య నౌకల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. తాజా నిషేధాజ్ఞల వల్ల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గంలో నడిచే అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ, యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతంలోకి దేశ పౌరులను పంపి ప్రమాదంలో పడేయలేమని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు నౌకాయాన నిపుణులు స్వాగతిస్తున్నారు. Strait of Hormuz Travel Restrictions, Indian Sailors Safety, DGMA Notice Gulf Region, US Iran Maritime Conflict, Commercial Ship Attacks Persian Gulf
http://www.teluguone.com/news/content/centre-issues-alert-to-indian-seafarers-36-226158.html





