స్పెషల్ గేమ్!.. ‘హోదా’ మళ్లీ తెరమీదకు..
Publish Date:Feb 12, 2022
Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేనెతుట్టెను కదిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ చేసిన ప్రసంగంలో, మోడీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తీరు సరిగా లేదని, అందుకే ఇన్నేళ్ళు అయినా ఉభయ తెలుగు రాష్టాల మధ్య తగవులు తెగడం లేదని అన్నారు. ఈ ప్రస్తావనకు ముందే మోడీ, బీజేపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పినా, తెరాస బీజేపీని తెలంగాణ వ్యతిరేకిగా చూపేందుకు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. చివరకు తెరాస ఎంపీలు రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఫై ప్రివిలేజి నోటీసు ఇచ్చారు. అదలా ఉంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న, వివాదాల పరిష్కారానికి ఫిబ్రవరి 8 వ తేదీన, కేంద్ర హోమ్ శాఖ, అదే శాఖ జాయింట్ సెక్రటరీ చైర్మన్’గా, కేంద్ర, ఏపీ, తెలంగాణ అధికారులు సభ్యులుగా ఒక అధికారుల సబ్ – కమిటీ (ఉప సంఘం) ఏర్పాటు చేసింది. బాగుంది. ఈ ఉప సంఘం తొలి సమావేశం, ఫిబ్రవరి 17న వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఇందుకు సంబంధించి, కేంద్ర హోమ్ శాఖ ఒక సర్కులర్ విడుదల చేసింది. సర్కులర్’తో పాటుగా మీటింగ్ ఎజెండాను కేంద్ర హోమ్ శాఖ జత చేసింది. అందులో మొత్తం తొమ్మిది అంశాలున్నాయి. మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్ విభజన.. రెండవది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నలుగుతున్న విద్యుత్ వివాదాల పరిష్కారం, అలాగే పన్నులకు సంబంధించిన అంశాలు ఇతరత్రా విషయాలు ఉన్నాయి. అయితే, ఈ అన్నిటితో పాటుగా, ఎజెండాలో తొమ్మిదవ అంశంగా ముగిసిన అధ్యాయం అంటూ అటకెక్కించిన ‘ప్రత్యేక హోదా’ అంశం కూడా ఉంది. నిజానికి, కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా గడచిన రెండున్నర మూడేళ్ళలో ప్రత్యేక హోదా విషయాన్నిఏ సందర్భంలో ప్రస్తావించలేదు. చివరకు, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్’లో కానీ, రాష్ట్రపతి ప్రసంగలో కానీ, ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం అయితే, హోదా విషయంలోనే కాదు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ధర్మంగా రావలసిన నిధులు గురించి కూడా ఏనాడూ కేంద్రాన్ని నిలదీయలేదు. నిజానికి, 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికారం, పార్లమెంట్’లో 25 మంది సభ్యుల బలం తమకు ఇస్తే, ప్రత్యేక హోదా పట్టుకోస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు ఆయన మాటలు నమ్మి ఘనంగా గానే పట్టం కట్టారు. 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను గెలిపించారు. అయినా, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జగన్ రెడ్డి హోదా విషయంలో చేతులు ఎత్తేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన నేపద్యంలో, కేంద్రాన్ని ప్రాధేయపడడం మినహా చేయగలిగింది ఏమీ లేదని, చేతులు ఎత్తేశారు. తెలుగు దేశం పార్టీ సభ్యులు ప్రత్యేక హోదా విషయాన్ని, పలుమార్లు పార్లమెంట్ లోపలా వెలుపలా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించినా, వైసీపీ ఎంపీలు పెదవి విప్పలేదు. కేంద్రం పట్టించుకోలేదు. అలాంటిది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని, సబ్-కమిటీ ఎజెండాలో ఎందుకు చేర్చినట్లు.. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలో హాట్ టాపిక్ గా ఉంది. ఫిబ్రవరి 17 వ తేదీ సమావేసంలో కానీ, కేంద్రం, ఉద్దేశ, దురుద్దేశాలు ఏమిటనేది తేలదు. బీజేపే నాయకత్వం 2024ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక హోదాతో ఏపీలో పాగావేసే ప్రయత్నం చేస్తోందా? లేక ఇంకేదైనా వ్యూహం ఉందా .. అంటే ఇటు ఏపీలో అటు తెలంగాణ విభజన తుట్టెను లేవడం వెనక ఏదో ఉండే ఉండవచ్చనే పరిశీలకులు అనుమానిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/central-committee-on-special-status-39-131665.html





