హోదా హుళక్కే.. తేటతెల్లం చేసిన కేంద్రం
Publish Date:Jul 19, 2022
Advertisement
ఊరించి ఊరించి ఊరగాయ బెట్టి ఆఖరికి ముక్కలేదు తర్వాత చూద్దాం అని నూనె జాడీ చూపించింది వెనకటికి ఓ బామ్మగారు. అదుగో అలా మారింది ఆంధ్రప్రధేశ్ ప్రత్యేక హోదా తంతు. 2014లో ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామన్న హామీ ఇచ్చారనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా విడిపోవడానికి అప్పటి నాయకులు అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటయింది. అప్పటి నుంచి హోదా గురించి ఎప్పుడు చర్చ లేదా ప్రశ్నలు తలెత్తినా ఏదో మాయమాటలు చెప్పి తెలుగు ప్రజల, ప్రభుత్వ ఆవేశాన్ని చల్లా ర్చడం కేంద్రం పెద్ద పనిగా పెట్టుకుంది. కాలం గడిచిపోయింది రాష్ట్రానికి వీలయినంత ఆర్ధిక సాయం చేస్తామని ఊరించి అసలు హోదా మాటనే మర్చిపోయేలా చేశారు కేంద్రంలోని బిజెపీ పెద్దలు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా సాధించుదామనే అన్నారు. కానీ క్రమేపీ కేంద్రానికి దాసోహం అనడంతో ఆ మాటను మార్చి ఏవేవో కబుర్లు చెబుతూ, జగన్‌ని అసలా అంశాన్ని ఎత్తకుండా చేశారు. జగన్ కేవలం కేంద్రంలో నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్ప ప్రత్యేక హోదా గురించి ఇతర అంశాల గురించి పల్లెత్తు ఏమీ మాట్లాడటం లేదు. జనం పూర్తిగా దాని సంగతే మర్చిపోయారన్న భ్రమలో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రత్యేక హోదా అంశం చర్చకు తెరలేపింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హోదాపై అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వంమళ్లీ పాత పాటే పాడింది. లోక్‌సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందన్నారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి..ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు.
...
హోదా సాధనకు ఒక సుధీర్ఘ పోరాటాన్ని వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలతో సహా అన్ని పార్టీలు తమ విభేదాలను వీడి ఎస్సీ ఎస్‌ఎస్ సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమకు అత్యధికంగా ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కోసం పాటుపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఇప్పుడు మౌనంగా ఉండటం పట్ల రాష్ట్రంలో విపక్షాలతో పాటు ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంలో బిజెపీని దీటుగా ఎదర్కోవడంలో వైసీపీ ని పూర్తిగా నమ్మి మోసపోయామన్న అభిప్రాయాలే అంతటా వినవస్తున్నాయి. కేంద్రంతో కొంత సహచర్యం వున్న జగన్ హోదా విషయంలో మాత్రం వారిని ఒప్పించడంలో దారుణంగా విఫలమయ్యారు. పైగా కేంద్రం మనసులో మాట జగన్‌కు తెలిసి కావాలనే అసలు రహస్యాన్ని బయటపెట్టక కాలక్షేపం కబుర్లతో ప్రజల్ని మోసం చేశారన్నది తేటతెల్లమయింది.
http://www.teluguone.com/news/content/center-shows-empty-hands-to-ap-again-on-special-status-25-140113.html