గాలిలోనూ కరోనా వైరస్ కణాలు! సీసీఎంబీ పరిశోధనలో తేలిన నిజాలు
Publish Date:Jan 6, 2021
Advertisement
కరోనా కణాలు గాలిలో ఉంటాయా..ఉంటే ఎంత పరిధి వరకు ప్రభావం చూపిస్తాయి .. ఓపెన్ ప్లేస్ లో కరోనా వైరస్ ఎంత కాలం ఉండగలుగుతుంది.. ఇవన్ని కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి క్లారిటీ లేకుండా ఉన్న ప్రశ్నలే. కరోనా వైరస్ కణాలు గాలిలో ఉంటాయా లేదా అన్న విషయంలో ఒక్కో రీసెర్చ్ సంస్థ ఒక్కో అభిప్రాయం చెప్పడంతో పూర్తి క్లారిటీ రాలేకపోయింది. అయితే తాజాగా దీనిపై సమగ్రమైన వివరణ ఇచ్చింది సీసీఎంబీ. కరోనా పేషెంట్ల కోసం కేటాయించిన ఆసుపత్రుల ఆవరణలోని గాలిలో, ఐసీయూ-ఐసొలేషన్ వార్డుల్లోని ఉపరితల వాతావరణంలో కరోనా వైరస్ కణాలు ఉన్నట్లు గుర్తించింది. పాజిటివ్ పేషెంట్లను వార్డుల్లోకి పంపడానికి ముందు, వారికి చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జి అయిన ఆరేడు గంటల తర్వాత తీసుకున్న గాలి నమూనాల్లో వైరస్ తేడాలను సీసీఎంబీ విశ్లేషించింది. హైదరాబాద్ నగరంలోని మూడు ఆసుపత్రులు. పంజాబ్‌లోని మొహాలి మూడు ఆసుపత్రుల్లో సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం జరిపారు. హైదరాబాద్‌లో సెప్టెంబరు-నవంబరు మాసాల మధ్య 41 శాంపిళ్ళను సేకరించగా.. మొహలిలో జూలై-డిసెంబరు మధ్యలో 23 శాంపిళ్ళను సేకరించి ఆ ప్రయోగాలు జరిపారు. గాలిలో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి నమూనాలను ప్రత్యేక పద్ధతుల్లో సేకరించి, ఆర్టీ-పీసీఆర్ పద్ధతిలో లాబ్‌లో పరీక్షలు చేశారు. కరోనా వార్డుల్లో మాత్రమే గాలిలో ఈ వైరస్ ఉన్నట్లు. నాన్-కొవిడ్ వార్డుల్లో లేదని తేలిందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు. కరోనా పేషెంట్లు ఉన్న వార్డుల్లో ఫ్యాన్, ఎయిర్ కండిషన్ వినియోగం ఉన్నప్పుడు, అవి లేనప్పుడు వేర్వేరుగా శాంపిళ్ళు తీసుకుని పేషెంట్ బెడ్‌కు ఎంత దూరం వరకు గాలిలో వైరస్ ఉందో పరీక్షించినట్లు తెలిపారు. ఫ్యాన్ లేదా ఏసీ ఉన్నప్పుడు గది మొత్తం వైరస్ ఆవరించిందని, అవి లేనప్పుడు క్లోజ్డ్ రూమ్‌గా ఉన్నచోట గరిష్ఠంగా 12 అడుగుల దూరం వరకు వ్యాపించినట్లు తెలిపారు. ఇక పేషెంట్లో కరోనా తీవ్రతకు, గదిలో ఉన్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా వైరస్ తీవ్రత కూడా ఎక్కువ ఉన్నట్లు తేలిందన్నారు. అధ్యయనం లోతుగా జరిగేందుకు ఒక పాజిటివ్ పేషెంట్‌ను వార్డులో ఒక మూలకు ఉంచి కొన్ని గంటల తర్వాత శాంపిళ్ళను సేకరించామని, తక్కువ తీవ్రత కలిగిన పేషెంట్లు ఉంటే.. గాలిలో తక్కువ దూరంలో వైరస్ ఉన్నట్లు తేలిందని రాకేశ్ మిశ్రా చెప్పారు ఒక పాజిటివ్ రోగిని ఫ్యాన్, ఏసీ లేని గదిలో రెండు గంటల సేపు ఉంచిన తర్వాత రెండు మీటర్ల వరకు గాలిలో వైరస్ వ్యాపించిందని ఆయన వివరించారు. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి మాస్కును మించిన వ్యాక్సిన్ లేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా మరోసారి స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంతవరకు మాస్కులే సోషల్ వ్యాక్సిన్లని చెప్పారు. మాస్కును ధరించడమే వైరస్ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గమన్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్కు, హ్యాండ్ వాష్.. ఈ మూడు కరోనా నుంచి దూరంగా ఉండడానికి చాలా ఉపయోగకరమన్నారు. పాజిటివ్ పేషెంట్లు ఐసొలేషన్‌లో ఉండడం ద్వారా వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడవచ్చని, ప్రతి ఒక్కరూ ఇలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కరోనా నుంచి తొందరగా బయట పడగలుగుతామన్నారు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా.
http://www.teluguone.com/news/content/ccmb-report-says-covid-virus-in-air-also-39-108576.html





