మళ్లీ ‘జన్మభూమి’.. గతం కంటే మెరుగ్గా!
Publish Date:Aug 10, 2024
Advertisement
చంద్రబాబు సర్కార్ మళ్లీ జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టాలని ప్రకటించింది. గతంలో జన్మభూమి పథకం కేవలం తెలుగుదేశం కార్యకర్తలకే లాభం చేకూరిందనే విమర్శలు వచ్చాయి. జన్మభూమి కమిటీలపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఈ కార్యక్రమం కొన్నాళ్లకు యాంత్రికంగా తయారైంది. నోడల్ అధికారుల వ్యవస్థపై ఆనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సారి జన్మభూమి కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా, పటిష్టంగా ప్రజా సమస్యల పరిష్కార సాధనకు ఉపయోగ పడేలా ఎమ్మెల్యేలు, మంత్రుల వంటి ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణతో మరింత సమర్ధవంతంగా అములు చేయాలన్న పట్టుదలను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. 1995లో చంద్రబాబు సీఎం అయిన తరువాత జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికారయంత్రాంగాలను కలుపుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికగా పరిచయం చేసారు. ఇందులో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేసారు. ఒక ఊరిని,ప్రదేశాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి సహకరించే లా తీర్చిదిద్దారు. దీనిని అంశాల వారిగా మహిళా జన్మభూమి, రైతు జన్మభూమి,కార్మిక జన్మభూమి గా విభజించి వారి సమస్యలు పరిష్కారానికి బాటలు వేసారు. జన్మభూమి పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. ఇప్పుడు దానిని మరింత మెరుగుపరచి రెండో జన్మభూమి గా పరిచయం చేయనున్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం.పేదరిక నిర్మూలన, సంపద సృష్టి ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం మరింత గొప్పగా ఉంది. ఏదిఏమైనా జన్మభూమి కార్యక్రమంపై గతంలో వచ్చిన విమర్శలకు తావు లేకుండా ప్రజల కోసం చిత్తశుద్ధితో అమలు చేయాలి.మొక్కబడిగా కాకుండా నిర్మాణాత్మకంగా రూపొందిస్తే విజయం సాధించి ప్రజలు మన్ననలను పొందుతుందనగంలో ఎటువంటి సందేహం లేదు.
http://www.teluguone.com/news/content/cbn-announce--janmabhoomi--programme-25-182670.html





