చంద్రబాబు, పవన్ బిగ్‌ప్లాన్.. రేషన్ బియ్యం మాఫియాకు ఇక దడదడే!
Publish Date:Dec 3, 2024
Advertisement
రేషన్ బియ్యం దందాకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టబోతోందా.. బియ్యం మాఫియా వెనుక ఉన్న సూత్రదారుల లెక్క తేల్చడమే కూటమి పెద్దల టార్గెటా.. కూకటివేళ్లతో బియ్యం మాఫియా సామ్రాజ్యాన్ని పెకలించి వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయా.. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీలో జరిగిన చర్చను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా షిప్ ల ద్వారా దేశ సరిహద్దులు దాటిస్తున్న మాఫియాపై కూటమి ప్రభుత్వం గురిపెట్టింది. అయితే, ఈ ప్రక్రియ ఏదో ఆషామాషీగా, హడావుడిగా మొదలు పెట్టింది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న రేషన్ బియ్యం దందాపై ఫోకస్ పెట్టింది. మాఫియా సామ్రాజ్యాన్ని ఛేదించుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ అసలు దందా ఎలా జరుగుతుంది.. దానికి కారణం ఏమిటి.. ఎలా రేషన్ బియ్యం అక్రమ రవాణా దందాకు చెక్ పెట్టాలనే విషయాలపై చంద్రబాబు, పవన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కనుసన్నల్లో సీక్రెట్ ఆపరేషన్ జరిపినట్లు తెలుస్తోంది. ఈ దందాపై ఓ అవగాహనకు వచ్చిన తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చకు తెరలేచింది. ఆ తరువాత రేషన్ బియ్యం మాఫియా దారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రావడం.. వెంటనే రేషన్ బియ్యం మాఫియాకు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. తాజాగా చంద్రబాబుతో పవన్ భేటీ కావడంతో ఈ ప్రక్రియ అంతా వ్యూహాత్మకంగానే జరిగినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి పోర్టులే కారణమా.. అసలు రీజన్ ఇంకా ఏమైనా ఉందా అనే అంశంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రేషన్ బియ్యం తీసుకుంటున్నవారిలో 80శాతం మంది ఆ బియ్యాన్ని రేషన్ మాఫియాకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కిలో బియ్యానికి రూ. 40 ఖర్చుచేసి తెల్లరేషన్ కార్డుదారులకు ఒక రూపాయికే అందిస్తున్నాయి. అయితే, ఈ బియ్యాన్ని అధిక శాతం మంది రేషన్ మాఫియాకు రూ. 10 నుంచి 12 రూపాయలకు విక్రయిస్తున్నారు. వారు మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్న వారికి రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు.. ఆ తరువాత ఆ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా ఇతర దేశాలకు రవాణా చేసి అక్కడ భారీ ధరకు విక్రయాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇలా ఒక్కో నెలకు వందల కోట్ల రూపాయలు మాఫియా సామ్రాజ్యాన్ని నడిపేవారు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. అయితే, ఈ దందాకు అసలు సూత్రదారులు వైసీపీ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన వారేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ తతంగమంతా అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. దందాను మరింత విస్తృతం చేసేందుకే గత వైసీపీ ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేందుకు వాహనాలను కొనుగోలు చేసిందన్న వాదన ఉంది. ఆ వాహనాల ద్వారానే రేషన్ బియ్యాన్ని నేరుగా మాఫియా దారుల వద్దకు చేర్చేవారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు వైసీపీ ప్రజాప్రతినిధులతో పాటు.. ఇతర పార్టీల్లోని పలువురు ప్రజాప్రతినిధులకు చేరినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ పోర్టు వేదికగా వేళ్లూనుకుపోయిన రేషన్ బియ్యం మాఫియా సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు నడుంబిగించింది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులువేస్తూ మాఫియా దారుల్లో వణికు పుట్టించడంతో పాటు.. ఇందులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలను కటకటాల వెనక్కు నెట్టేందుకు ప్లాక్కా ప్లాన్ తో చంద్రబాబు, పవన్ ముందుకు సాగుతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాకినాడ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు బహిర్గతమవుతున్నది. కాకినాడ పోర్టు అరబిందో చేతిలో ఉంది. అతను వైసీపీ ఎంపీకి బంధువు. అయితే, తొలుత కేవీ రావు చేతిలో పోర్టు ఉండేది.. ఆయనకు పోర్టులో అత్యధికంగా 41శాతం వాటా ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకిదిగి కేవీ రావును బెదిరింపులకు గురిచేసి కాకినాడ పోర్టును అరబిందోకు అప్పగించినట్లు సమాచారం. అరబిందో చేతిలోకి కాకినాడ పోర్టు వచ్చిన తరువాత విశాఖ, గంగవరం, కృష్ణపట్నం కంటే ఎక్కువ ఎగుమతి జరుగుతూ వచ్చింది. గడిచిన మూడేళ్ల కాలంలో కోటీ31లక్షల టన్నుల ఎగుమతి జరిగిందని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత మూడేళ్లలో 45 వేల కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని కికానాడ పోర్టు ద్వారా తరలించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారం.. కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న రేషన్ బియ్యం దందాను అరికట్టేందుకు ముందుకుసాగుతుంది. దీంతో ఈ మాఫియాలో భాగస్వాములుగా ఉన్న వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కూటమి నేతలు లేవనెత్తుతున్న అంశాలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు విషయాన్ని తెరమీదకు వచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. స్టెల్లా షిప్ ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్‌స్టార్ షిప్‌ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు ఆ షిప్ లో బియ్యం తరలిస్తున్నారనే సమాచారం ఉందని చెప్పారు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణసైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కూటమి ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారని అర్థమౌతోంది. ఇదిలాఉంటే మరోవైపు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అయితే, పవన్ భేటీ ముగిసిన తరువాత చంద్రబాబుతో ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు, ఇంటెలిజెన్స్ డీజీపీ మహేశ్ చంద్ర లడ్డా భేటీ అయ్యారు. కాకినాడ వేదికగా రేషన్ బియ్యం దందాకు అడ్డుకట్ట వేసే విషయంపై చర్చించారు. ఈ అంశంలో డీజీపీ నేతృత్వంలో కమిటీవేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో రేషన్ బియ్యం దందా వ్యవహారం ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న భయంతో వణికిపోతున్నారు.
http://www.teluguone.com/news/content/cbn-and-pawan-big-plann-39-189343.html