మంత్రివర్గ విస్తరణ..వేటుకు రంగం సిద్దం
Publish Date:Jan 18, 2012
Advertisement
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పచ్చజెండా ఊపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సుమారు గంటన్నరపాటు మంత్రివర్గ విస్తరణపై సోనియాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కొత్తగా అయిదుగురిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ముగ్గురిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఉదయం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ముందు తన వాదనను బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరితో పాటు మరింత మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని, కొంత మందికి ఉద్వాసన చెప్పాలని ముఖ్యమంత్రి వాదిస్తూ వస్తున్నారు. ఇందుకు సంబంధించి కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చిరు వర్గానికి చెందిన ఇద్దరికి, తెలంగాణకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి కసరత్తు పూర్తయినట్లు చెబుతున్నారు. శంకరరావుకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు రాజీనామాలు చేయడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఈ స్థితిలో ఖాళీల్లో తెలంగాణ మంత్రులను తీసుకోకుండా చిరంజీవి వర్గానికి మాత్రమే మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కిరణ్ కుమార్ రెడ్డి వాదిస్తూ వస్తున్నారు. అలాగే, వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామా వల్ల వ్యవసాయ శాఖకు మంత్రి లేకుండా పోయారు. కొంత మంది మంత్రులకు ఉద్వాసన పలికి, కొత్తవారిని తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకుండా చిరంజీవి వర్గానికి మంత్రి పదవులు ఇవ్వడం సరి కాదని అంటున్నారు. ముఖ్యమంత్రి అభిప్రాయంతో అధిష్టానం ఏకీభవించినట్లు చెబుతున్నారు. సోనియాతో సమావేశం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గానీ, ఆజాద్ గానీ మీడియాతో మాట్లాడలేదు. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కన్నా ముందే మంగళవారం సాయంత్రం ఆజాద్‌ను కలిశారు.
కాగా, మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల్లోనూ భారీగా మార్పులు జరగనున్నాయి. సీనియర్లకు శాఖల కేటాయింపులో సముచిత ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రికి సోనియా సూచించారు. పార్టీని ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపేందుకు సీనియర్ల సలహాలు తీసుకోవాలని సోనియా ఈ సందర్బంగా కిరణ్‌కు సూచనలు చేశారు.
http://www.teluguone.com/news/content/cabinet-enlargement-24-11008.html





