ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
Publish Date:Sep 9, 2025
Advertisement
భారత 17వ ఉప రాష్ట్రపతిగా ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు, సుదర్మన్‌రెడ్డికి 300 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. దీంతో రాధాకృష్ణన్ 152 ఓట్లుతో గెలుపోందారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పార్లమెంట్‌లోని ఉభయ సభల సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరికంటే ముందుగా తన ఓటు వేశారు.ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేయగా, ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే, 15 మంది ఓట్లు చెల్ల లేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 13 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరిలో బిజూ జనతాదళ్ (బీజేడీ) నుంచి ఏడుగురు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి నలుగురు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నుంచి ఒకరు, మరో స్వతంత్ర ఎంపీ ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన మద్దతు లభించడం లేదన్న కారణంతో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆరెస్సెస్ స్వయంసేవకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఆయన ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన కోయంబత్తూరు లోక్ సభ నుంచి 1998, 1999 రెండుసార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2014, 2019లో వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. 2023 ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఆ తర్వాత 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి ఉద్యమంతో ప్రారంభించారు. 2007లో తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 93 రోజుల్లో రాష్ట్రంలో 19 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ ప్రయాణంలో ప్రధానంగా నదుల అనుసంధానం, ఉగ్రవాదం, ఉమ్మడి పౌరస్మృతి, అంటరానితనం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై దృష్టి సారించారు. ఆ తర్వాత కూడా ఆనకట్టలు, నదుల సమస్యపై 280 కిలోమీటర్లు, 230 కిలోమీటర్ల చొప్పున రెండుసార్లు పాదయాత్రలు చేశారు.
http://www.teluguone.com/news/content/cp-radhakrishnan-39-205867.html





