టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం.. కొలువుదీరిన కొత్త బోర్డు
Publish Date:Nov 6, 2024
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బుధవారం (నవంబర్ 6) ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 17 మంది సభ్యులు కూడా ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో బీఆర్ నాయుడు చేత ఈవో శ్యామలరావు ప్రమాణ స్వీకారం చేయించారు. టీటీడీ పాలకమండలి సభ్యులుగా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వీరంతా శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపడంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం టీటీడీ కొత్త పాలక మండలి మీడియా సమావేశంలో పాల్గొంటుంది. కాగా ఈ కొత్త పాలక మండలిలో టీడీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు , మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ సుచిత్ర ఎల్లా , రాజమహేంద్రవరం రఘుదేవపురానికి చెందిన అక్కిన మునికోటేశ్వరరావు, నంద్యాల జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, పల్నాడు జిల్లాకు చెందిన జంగా కృష్ణమూర్తి, కుప్పం క్లస్టర్ ఇన్‌చార్జి వైద్యం శాంతారాం, మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఇక జనసేన నుంచి పవన్‌కల్యాణ్ సన్నిహితుడు, తెలంగాణ జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌రెడ్డి, సినీ ఆర్ట్ డైరెక్టర్, పవన్‌కల్యాణ్ స్నేహితుడు బూరగాపు ఆనంద్‌సాయి, జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ ఉన్నారు. అలాగే ఫార్మా రంగంలో ఉన్న నాట్కో గ్రూప్ వైస్ చైర్మన్ సన్నపనేని సదాశివరావు, ఎన్‌ఆర్‌ఐ జాస్తి పూర్ణసాంబశివరావు, కర్ణాటక పారిశ్రామికవేత్తలు నరేషకుమార్, కాఫీ రంగంలో ప్రముఖుడైన ఆర్‌ఎన్ దర్శన్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్ సభ్యులుగా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన రామ్మూర్తి, ఎంసీఐ చైర్మన్‌గా పనిచేసిన గుజరాత్‌కు చెందిన కేతన్ దేశాయ్ కుమారుడు అదిత్‌దేశాయ్, మహారాష్ట్రకు చెందిన ఆర్థిక నిపుణుడు సౌరభ్ బోరా, కేంద్రమంత్రి అమిత్‌షా సన్నిహితుడు కృష్ణమూర్తి వైద్యనాథన్ కూడా టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా స్థానం దక్కించుకున్నారు. స్థానికంగా ఉంటూ శ్రీవారి భక్తుల సమస్యలపై నిరంతరం స్పందించే బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కూడా నూతన బోర్డులో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/brnaidu-swornin-as-ttd-chairmen-39-187941.html