మండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు.. దద్దమ్మ.. దున్నపోతు అంటూ మాటల యుద్ధం.!
Publish Date:Aug 17, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల తొలిరోజే అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీ సభ్యుల మధ్య మాటలయుద్ధంతో రాజకీయం వేడెక్కింది. ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు. సభా మర్యాద మరిచి వ్యక్తిగత దూషణలకు దిగారు. ఒకరు దద్దమ్మ అంటే మరొకరు దున్నపోతు అన్నారు. అసలీ రచ్చకు కారణం సభలో డీఎస్సీ అంశంపై మొదలైన సాధారణ చర్చ. ఈ చర్చ సందర్భంగా బొత్స, అచ్చెన్నాయుడు ఇరువురూ కూడా సంయమనం కోల్పోయి, వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగడమే కాకుండా బాడీ షేమింగ్ వ్యాఖ్య కూడా చేసుకున్నారు. వైసీపీ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారంటూ ప్రశ్నించిన మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నాయకత్వాన్ని నిలదీశారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ వ్యవహరించిన తీరును ఎండగట్టారు. అప్పట్లో సరైన నోటిఫికేషన్ ఇవ్వలేని దద్దమ్మ అంటూ విమర్శించారు. అచ్చెన్నాయుడు చేసిన దద్దమ్మ వ్యాఖ్యపై దీటుగా స్పందించిన బొత్స సత్యనారాయణ, అచ్చెన్నాయుడుపై బాడీ షేమింగ్ కు దిగారు. ఎవరు ఎద్దులాగా పెరిగారో, ఎవరు దద్దమ్మో, ఎవరు ఆంబోతో ప్రజలందరికీ తెలుసునంటూ బొత్స వ్యాఖ్యానించారు. ఈ వివాదం సభలో కలకలం రేపాయి. Botsa Satyanarayana, Atchannaidu, AP Legislative Council, DSC Notification, YCP vs TDP, AP Politics, TeluguOne
http://www.teluguone.com/news/content/botsa-satyanarayana-39-229089.html





