నిర్మల బడ్జెట్ లో బ్లండర్ మిస్టేక్స్
Publish Date:Feb 3, 2022
Advertisement
పొరపాటో గ్రహపాటో గానీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతోంది. అధికార పక్షం బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందనడం, విపక్షం పరమచెత్త బడ్జెట్ అని రాళ్లేయడం... ఇవన్నీ మామూలే. కానీ నిర్మల బడ్జెట్ లో కొన్ని ఫిగర్లను చూసిన సామాన్య జనం మాత్రం తెగ ఆశ్చర్యపోతున్నారు. నిజమా.. భ్రమా అంటూ కళ్లు నులుముకొని మరీ ఆ రెండు వాక్యాలను చదువుతున్నారు. ఫిగర్ లో ఉన్న సున్నాలను అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు లెక్కేసి మరీ క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా నిర్మలమ్మ కేటాయించిన ఫిగర్ మీద క్లారిటీ రావడం లేదు. ఇంతకీ విషయమేంటంటే... పీఎం ఈ-విద్య అనే పథకం కింద నిర్మల అక్షరాలా లక్ష రూపాయలు కేటాయించారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు, ఆఫ్ లైన్ విద్య అందని పరిస్థితుల్లో కూడా ఆన్ లైన్ విద్యను అందించేందుకు ఇప్పటివరకు ఉన్న 12 ఎడ్యుకేషన్ చానెల్స్ ను 200 కు పెంచుతామని, ఈ పెంపుదలతో విద్య అంతా కూడా దేశ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని, ఇందుకోసం రూ. లక్ష కేటాయిస్తున్నామని నిర్మల అనౌన్స్ చేశారు. విద్యలో ప్రగతి కోసం చానెల్స్ పెంపకం బాగానే ఉన్నా... అందుకు సరిపడినంత ద్రవ్య కేటాయింపులు జరపాలి కదా. 200 చానెల్స్ ఏర్పాటు చేయడానికి, ఎడ్యుకేషన్ కంటెంట్ ఇవ్వడానికి ఆఫ్టరాల్ లక్ష రూపాయలు ఎలా సరిపోతాయో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అయితే అది అచ్చు పొరపాటు అయ్యుండవచ్చని, అంతే తప్ప నిజంగా 200 చానల్స్ కు లక్ష రూపాయలు కేటాయింపు ఉండే చాన్సే లేదని అధికారులు అంటున్నారు. మొత్తానికి ఈ ఫిగర్ మీద క్లారిటీ కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇక అలాంటి కేటాయింపే మరోటి కూడా చోటు చేసుకుంది.. ఈ బడ్జెట్ లో. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్ కు అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమే కేటాయిస్తూ బడ్జెట్ లో అచ్చయింది. ఇదేమిట్రా రైల్వే ప్రాజెక్టుకు ఎక్కడైనా రూ. వెయ్యి కేటాయించడమేంటీ... జిరాక్స్ కాపీలకు కూడా సరిపోవు కదా అని సెటైర్లు విసురుకుంటున్నారు సామాన్య జనం.
http://www.teluguone.com/news/content/blunder-mistakes-in-budget-2022-39-131222.html





