పార్టీ మారొద్దని ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన కేసీఆర్? రాజాసింగ్ సంచలనం..
Publish Date:Aug 16, 2021
Advertisement
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మల్కాజ్ గిరిలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ కార్పొరేటర్ మధ్య జరిగిన గొడవ.. రాజకీయ సెగలు రేపుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడగా.. ఆయనకు కౌంటర్ గా కమలనాధులు రెచ్చిపోతున్నారు. మైనంపల్లి టార్గెట్ గా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మైనంపల్లిని అరెస్టు చేయాలంటూ మల్కాజ్ గిరి బంద్ నిర్వహిస్తోంది బీజేపీ. అటు టీఆర్ఎస్ వర్గాలు సై అంటుండటంతో మల్కాజ్ గిరిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరడానికి మైనంపల్లి ప్రయత్నాలు చేశారని, ఆయన నేర చరిత్ర తెలిసే పార్టీలోకి చేర్చుకోలేదని చెప్పారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తాము తలుచుకుంటే మైనంపల్లి తట్టుకోలేరని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్‌పై మైనంపల్లి దాడి చేయడాన్ని రాజాసింగ్ ఖండించారు. పిచ్చి పట్టిన అనంతరం కుక్క ఏ మాదిరిగా ప్రవర్తిస్తుందో మైనంపల్లి కూడా అలా మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన తీరు ఇలానే ఉంటుందా? అని నిలదీశారు. బీజేపీలోకి రావాలని ప్రయత్నించిన మైనంపల్లి... బండి సంజయ్ చుట్టూ తిరిగాడని, ఢిల్లీలో కూడా తిరిగాడని, ఇది వాస్తవం కాదా? అని రాజా సింగ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నా కాళ్లు మొక్కిండు అందుకే టీఆర్ఎస్లో ఉండిపోయా అని మైనంపల్లి చెప్పారంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మైనంపల్లి పరిస్థితి అక్కడ, ఇక్కడ కాకుండా పోయిందనేది అర్ధం అవుతోందన్నారు. టీఆర్ఎస్ వాళ్లు నిన్ను లాట్ కొట్టి బయటకు పంపిస్తారు.. ముఖ్యమంత్రి చెబితేనే నీ పైన ఎఫ్ఐఆర్ అయిందని తెలుసుకో మైనంపల్లి అంటూ రాజాసింగ్ విరుచుకుపడ్డారు.
http://www.teluguone.com/news/content/bjp-mla-rajasingh-hot-comments-on-mynamapalli-hanumantha-rao-39-121520.html





