వాళ్ల ఎంట్రీతో.. మేకపాటి కుటుంబంలో రాజకీయ కల్లోలం!
Publish Date:Apr 5, 2022
Advertisement
రాజకీయ నాయకుల కుటుంబాల్లో నిన్నటి వరకు మేకపాటి ఫ్యామిలీ ఓ వెలుగు వెలిగింది. మేకపాటి కుటుంబంలోని వ్యక్తులు ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, మంత్రిగా పదవులను అధిరోహించారు. అలాంటి మేకపాటి కుటుంబంలో నెలకొన్న కలహాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకప్పుడు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి పారిశ్రామికంగా, రాజకీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. అయితే.. తాజాగా ఆ కుటుంబంలో పొడచూపిన కలహాలతో ఆ పరువు కాస్తా గంగలో కలిసినట్లయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటూ.. తమ కుటుంబం రాజకీయంగా మరింతగా ఎదిగేందుకు ఊతం ఇచ్చారు. గౌతమ్ రెడ్డి అకాల మరణంతో మేకపాటి కుటుంబంలో కలహాలు ఒక్కసారిగా వెలుగులో చూశాయి. ఈ మధ్య కాలంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే కుటుంబానికి చెందిన మేకపాటి మేనల్లుడు బిజివేముల రవీంద్రారెడ్డి మేనమామాల కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దాంతో మేకపాటి కుటుంబంలో అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న కలహాలు బయటపడడానికి దారితీశాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిత మృతితో ఖాళీ ఏర్పడ్డ నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో వారి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయాలనే సందిగ్ధత నెలకొంది. గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తిరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ఉండగా.. రాజమోహన్ రెడ్డి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో మామా కోడళ్ల మధ్య అంతర్గత విభేదాలున్నట్లు రాష్ట్రమంతటా ఓ రేంజ్ లో చర్చ జరిగింది. ఇదిలా ఉండగా.. తగుదునమ్మా అంటూ మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆ కుటుంబానికి మరింత తలనొప్పిగా మారారట. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య నేనున్నానంటూ ప్రత్యక్షంగా బయటికి రావడం, అధికార కార్యక్రమాల్లో పాల్గొని తాను కూడా వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం బరిలో దిగుతానంటూ సంకేతాలు ఇచ్చారు. మేకపాటి కుటుంబంపై తాను పోటీ చేస్తానంటూ అదేరోజున మేకపాటి మేనల్లుడు బిజివేముల రవీంద్రారెడ్డి ప్రకటించడంతో ఆ కుటుంబంలో రాజకీయంగా అల్లకల్లోలం సృష్టించింది. ఒక పక్కన మామా కోడళ్ల మధ్య విభేదాలు.. అది చాలదన్నట్లు చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య.. వీరంతా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోకుండానే లోపల్లోపల కత్తులు దూసుకుంటున్నారని అంటున్నారు. ఇదంతా మేకపాటి కుటుంబ రాజకీయ ప్రస్థానంపై పెద్ద మచ్చగా మారింది. ఒకప్పుడు మేకపాటి కుటుంబం ఆర్థికంగా, రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ ఆ కుటుంబంలో ఒక్క మరణంతో వారి పరువు కాస్తా పెన్నానదిలో కలిసినట్లయింది. మేకపాటి కుటుంబంలో జరుగుతున్న చిత్ర విచిత్రాల గురించి జిల్లా ప్రజలు, వైసీపీ నేతలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అన్నదమ్ముల మధ్య ఇంత లొల్లి ఉందా? అని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నిక మేకపాటి కుటుంబానికి సవాల్ గా లేనప్పటికీ మంత్రి పదవి దక్కించుకోవాలనే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరాటం కాస్తా కుటుంబంలో ఏర్పడ్డ విభేదాల కారణంగా బూమరాంగ్ అయ్యేలా కనిపిస్తోందంటున్నారు. నిన్నటి దాకా మేకపాటి కుటుంబానికే మంత్రి పదవి ఖాయమని చర్చించుకుంటున్న జనం.. ఆ కుటుంబంలో జరుగుతున్న నాటకీయ పరిణామాలు వారికి అడ్డంకిగా మారుతున్నాయంటున్నారు. చేతి వరకూ వచ్చిన మంత్రి పదవి ఇక చేజారినట్లే అని నెల్లూరు జిల్లాలోని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత రాజకీయంగా మేకపాటి కుటుంబం ఖేల్ ఖతం అని ఆ కుటుంబ సభ్యులే చెప్పకనే చెప్పినట్లు అయిందనే వ్యాఖ్యలు జిల్లా ప్రజలు, వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/big-rift-in-mekapati-family-39-133945.html





