ఈటలకు హై కోర్టులో ఊరట.. జమునా హేచరీస్ భూముల్లో జోక్యం వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు
Publish Date:Jul 2, 2022
Advertisement
ఈటలకు హైకోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా అచ్చంపేటలోని సర్వే నంబరు 130లో జమునా హేచరీ్‌సకు ఉన్న మూడు ఎకరాల భూమి విషయంలో వచ్చే నెల 1 వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల భూములు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెదక్ కలెక్టర్, స్థానిక ఆర్డీవో, మాసాయిపేట తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీచేసింది. ఈ మూడెకరాలు ప్రభుత్వ భూములని, వాటిని ఆక్రమించడంపై వివరణ ఇవ్వాలంటూ గత నెల 25న మాసాయిపేట తహసీల్దార్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ జమునా హేచరీస్, ఆ సంస్థ డైరెక్టర్ ఈటల నితిన్‌రెడ్డి, ఈటల జమున హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. గతంలో కలెక్టర్ ప్రాథమిక సర్వే పూర్తిచేశారని, పూర్తిస్థాయి సర్వే కొనసాగుతోందని వివరించారు. సర్వే పూర్తికాకముందే.. భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందని ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ వాదనతో విభేదించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఆగస్టు 1 వరకు ఆ భూముల విషయంలో అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. కాగా రైతులకు ప్రభుత్వం కేటాయించిన అస్సెన్డ్ భూములను కబ్జా చేసి ఈటల ఆ భూములలో జమునా హేచరీస్ నడుపుతున్నారన్న ఆరోపణలపై గత కొంత కాలంగా ప్రభుత్వం, ఈటల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి విదితమే. ఆ ఆరోపణలపైనే ఈటలను టీఆర్ఎస్ పక్కన పెట్టింది. కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది. దీంతో ఈటల తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ గూటికి చేరి..తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే భూముల విషయంలో మాత్రం తన న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.
http://www.teluguone.com/news/content/big-releaf-to-etala-in-high-court-39-138956.html





