పబ్బుల గబ్బు వెనుక పెద్దల పాత్ర!?
Publish Date:Apr 4, 2022
Advertisement
అక్కడ మొత్తం అన్నీ హైటెక్ రూల్సే.. ప్రవేశం నుంచి బయటకు వచ్చే దాకా అంతా అదే విధానం. కోడ్ చెప్పకపోతే నో ఎంట్రీ. అంటే.. ప్రవేశం పొందాలంటే ముందుగానే వేలకు వేలు పోసి హైటెక్ విధానంలో సీక్రెట్ కోడ్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ కోడ్ చెప్పి లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడంతా దో మార్ తీన్ మారే. హైదరాబాద్ నగరంలో వేలం వెర్రిగా పుట్టుకొస్తున్న పబ్బుల్లో నిత్యం జరిగే గబ్బు తంతు ఇదే అంటే అతిశయోక్తి ఉండదేమో. తాజాగా.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో వీవీఐపీల పిల్లలు, సెలబ్రిటీలు దొరకడం సంచలనంగా మారింది. వారిలో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం అలు పోలీసు వర్గాల్లో, ఇటు రాజకీయ, సినీ, వ్యాపార రంగంలోని పెద్దల్లో కలకలం రేపుతోంది. అయితే.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇంత విచ్చలవిడిగా పబ్బుల్లో జనాన్ని ఆకర్షించేలా చేయడంలో నిషేధిత మత్తు పదార్థాలు కొకైన్, ఎల్ఎస్ డీల సరఫరా ప్రధాన పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాధాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో పబ్బులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇలా నగరం నడిబొడ్డున పబ్బులకు అనుమతులు ఎలా వస్తున్నాయి? వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు? పబ్బుల ఏర్పాటు, నిర్వహణ వెనుక పెద్దల పాత్ర లేకుండానే జరుగుతున్నాయా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పబ్బుల సంస్కృతిని సమూలంగా నిర్మూలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. డ్రగ్స్ దందాపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గానే వర్కవుట్ చేస్తున్నారు. అయినా.. ఇంత యధేచ్ఛగా యువతీ యువకులను పబ్బులు ఆకర్షించడం, కోట్ల రూపాయల్ని కొల్లగొట్టడం వెనుక పలువురు రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల హస్తం ఉంటుందనేది బహిరంగ రహస్యం అంటున్నారు. నిజానికి పబ్బుల్లో ఏం జరుగుతోందో.. పోలీసులకు తెలియని విషయం ఏమీ కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక్కో పబ్బు వద్ద పదుల సంఖ్యలో బౌన్సర్లు ఉంటారు. టోల్ గేట్ పెట్టి అనుమతి లేని ఒక్క పురుగును కూడా లోపలికి వెళ్లకుండా పబ్బు బిజినెస్ రన్ చేస్తుంటారు. నగరం నడిబొడ్డులో ఇంత పకడ్బందీగా పబ్బు నిర్వహించాలంటే ఎంత గట్స్ ఉండాలి?.. మరెంత రాజకీయ, అధికార పలుకుబడి ఉండాలి..? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని వీఐపీ ప్రాంతాల్లో నడుస్తున్న పబ్బులన్నీ రాజకీయ నేతలు, బడా బాబుల పిల్లలు కానీ వారి బంధువులే కొనసాగుతున్నాయనేది బహిరంగ రహస్యం. అక్షర సత్యం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాధాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో నడుస్తున్న పబ్బులన్నింట్లోనూ ప్రముఖుల భాగస్వామ్యం ఉందంటున్నారు. ఇలాంటి ప్రముఖుల్లో మరికాస్త ఎక్కువ పలుకుబడి ఉన్న వారి జోక్యం ఉన్న పబ్బుల్లోనే డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందంటున్నారు. అలా డ్రగ్స్ దందా ఆయా పబ్బుల్లో జరగడానికి కారణం.. పోలీసులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అంటారు. అంటే.. పోలీసులను కూడా వారు ఎంతగా ప్రభావితం చేస్తారో.. ఎంతగా ప్రలోభపెడతారో.. మరెంతగా అదుపులో ఉంచుకుంటారో అనేది తెరమీదకు వస్తున్న అంశం. పొరపాటున ఏ పోలీసు అధికారి అయితే.. ఆ ప్రముఖుల పబ్బుల వైపు కన్నెత్తి చూశారంటే... అంతే సంగతులు. పొరపాటున అధికారులు ఏ కొంచెం జోక్యం చేసుకున్నా.. నియంత్రించే సాహసం చేసిన పోలీసు అధికారులకు ట్రాన్స్ ఫర్ తప్పదు. ఆ కారణం వల్ల తమకెందుకు వచ్చిన తలనొప్పి అని ఆయా పోలీసు అధికారులు పెద్దల పబ్బులను నియంత్రించే సాహసం చేయడానికి జంకుతారంటారు. పైగా పబ్బుల జోలికి రాకుండా పోలీసులకు లక్షల్లో నజరానాలను వాటి నిర్వాహకులు ముట్టజెబుతుంటారంటారు. దాంతో పాటు పోలీసు బాస్ ల అండ కూడా వారు తీసుకుంటారట. ఆ అండతోనే వారు పబ్బులు నిర్వహిస్తుంటారనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. నిజానికి బడా బాబుల కనుసన్నల్లో నడిచే పబ్బుల్లో రాత్రి 12 గంటల తర్వాతే అసలు బాగోతం మొదలవుతుందని చెబుతారు. అర్ధరాత్రి పబ్బు మెట్లెక్కే యువతీ యువకులు డ్రగ్స్ తీసుకునేందుకే వస్తారనేది తెలిసిన రహస్యం. అర్ధరాత్రి తర్వాత ఒక్క గంట పాటు పబ్బు నడుపుకునేందుకు అనుమతి ఇస్తే.. లక్షల్లో మామాళ్లు ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు వెనకడుగు వేయరట. అంటే.. ఆ ఒక్క గంటలో వారు చేసే డ్రగ్స్ దందా ఎన్ని లక్షల మేరకు జరుగుతుందో చెప్పకనే చెబుతుందంటారు. ఆ సమయంలో పబ్బుకు వచ్చే యువతీ యువకులు డ్రగ్స్ తీసుకుని తమ కార్డు నుంచి ఎంత డబ్బు స్వైప్ అవుతోందో కూడా తెలుసుకోలేని మత్తులోకి జారిపోతుంటారట. బయటి బార్ లో 2 వేలు ధర ఉండే మద్యం సీసాకు ఆ సమయంలో పబ్బు నిర్వాహకులు 10 వేలకు పైగానే వసూలు చేస్తారట. అర్ధరాత్రి దాటిన సమయంలోనే ప్రముఖుల కనుసన్నల్లో నడిచే పబ్బుల్లో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా జరిగిపోతుందంటున్నారు. అలాంటి పబ్బులోకి పోలీసులు అడుగుపెట్టరనే భరోసాయే అందుకు కారణం అంటారు. పెద్దలు తమ అదుపాజ్ఞల్లో నడిపిస్తున్న పబ్బుల్లో ఆ పెద్దల కొడుకులు, కుమార్తెలు, బంధువులే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతుండడం విశేషం. జనాన్ని మత్తులో ముంచే, డబ్బులు కొల్లగొట్టేందుకు నిర్వహిస్తున్న పబ్బుల గబ్బులో ఉన్నత కుటుంబాల్లోని వారే కూరుకుపోతుండడం గమనార్హం. మొన్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో దొరికిన వారిలో అనేక మంది అలాంటి వారి పిల్లలే దొరికిపోవడం గమనించాల్సిన విషయం. మెట్రో నగరాల్లోని పబ్బులను డ్రగ్స్ దందాకు అడ్డాలుగా మార్చడం ఆందోళన కలిగించే అంశం.
http://www.teluguone.com/news/content/big-hands-behind-pubs-39-133870.html





