పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
Publish Date:Feb 22, 2025

Advertisement
వివాహం తర్వాత అబ్బాయి, అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుంది. దీన్ని జన్మజన్మల బంధం అంటారు. దీనికి తగినట్టు భార్యాభర్తలు ఇద్దరూ వివాహం తరువాత అన్యోన్యంగా లేకపోయినా.. ఏవైనా విషయాలలో ఇబ్బందులు, అపార్థాలు తలెత్తినా ఆ బందం చాలా క్లిష్టంగా మారుతుంది. వివాహ సంబంధంలో భాగస్వామి మద్దతు ఇవ్వకపోతే ఆ సంబంధాన్ని కొనసాగించడం చాలా కష్టమవుతుంది. కుటుంబ సభ్యుల ఇష్టానుసారం పెద్దలు కుదిర్చిన వివాహం జరగడంలో చాలా వరకు పెద్దల ఇష్టం.. ఇరు కుటుంబాల ప్రయోజనాలు అన్నీ దృష్టిలో ఉంటాయి. కానీ కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు మాత్రం ఇబ్బందులలో ఇరుక్కుపోతారు. కేవలం అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడితే సరిపోదు. చాలా విషయాలలో స్పష్టత అవసరం అవుతుంది. జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాలలో వివాహం ఒకటి. అందుకే ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు తెలివిగా వ్యవహరించడం ముఖ్యం.
పెళ్లికి ముందు..
ప్రతి వ్యక్తి, కుటుంబం భిన్నంగా ఉంటారు. కాబట్టి కుటంబాలను, అమ్మాయి లేదా అబ్బాయిని పలుమార్లు కలవడం చాలా ముఖ్యం. అయితే చాలా వరకు కేవలం ఒకసారి అటువైపు వారు, ఇటువైపు వారు ఒకరింటికి ఒకరు వెళ్లి విషయాలు మాట్లాడుకుని పెళ్లి ఖాయం చేసుకుంటారు. కానీ పెళ్లి చేయాలని అనుకున్న తరువాత తొందర పడకుండా 3 నుండి 5 సార్లు ఒకరింటిని మరొకరు సందర్శించడం చాలా మంచిది. ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, కుటుంబాలను తెలుసుకోవడానికి, ఒకరినొకరు తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునేవారు ఒక్కసారి కుటుంబాలను, ఇళ్లను చూసి పెళ్లి ఖాయం చేసుకోవద్దు. ఇది ఇబ్బందులనే కాదు.. మోసాన్ని కూడా వెంటబెట్టుకుని ఉంటుంది.
మొదటిసారి పరిచయాలు చేసుకోవడం, అబ్బాయి లేదా అమ్మాయి విద్య, ఉద్యోగం, కుటుంబం గురించి మాట్లాడటం, వారి ఆసక్తులు, అభిరుచులు, నచ్చినవి, నచ్చినవి అన్ని తెలుసుకోవాలి. వీలైతే పెద్దల అనుమతి తీసుకుని అమ్మాయి, అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకోవడం మంచిది. చాలా మంది పెద్దలు అమ్మాయి, అబ్బాయి ఒకటైతే తరువాత వారే అన్నింటికి అడ్జస్ట్ అయిపోతారు అని అంటుంటారు. కానీ అది చాలా తప్పు. ఇద్దరూ అపార్థాలు చేసుకుంటే బంధం అస్సలు నిలబడదు.
రెండవ సారి కలిసినప్పుడు అమ్మాయికి, అబ్బాయికి జీవితం గురించి ఉండే లక్ష్యాలు, నెరవేర్చుకోవాలని అనుకునే కలలు, కెరీర్, ప్రణాళికలు, జీవనసైలి, భవిష్యత్తు గురించి ఉన్న ఆలోచనలు అన్నింటి గురించి మాట్లాడుకోవాలి. కుటుంబ విలువలు, సాంప్రదాల గురించి, వివాహం తరువాత రెండు కుటుంబాల గురించి ఇద్దరూ నడుచుకోవలసిన విధానం గురించి మాట్లాడుకోవాలి. చాలామంది పెళ్లి తర్వాత ఆడపిల్ల ఇంటికి ప్రాముఖ్యత అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇది అమ్మాయిని చాలా బాధపెడుతుంది. అలాగే పండుగలు, ఆచారాల గురించి కూడా తెలుసుకోవాలి.
మూడవసారి ఇద్దరూ ఒకరికి ఒకరు ఎంత ప్రాధాన్యత ఇస్తారు. ఇద్దరి మధ్య ఎంతవరకు సమన్వయం కుదిరింది వంటి విషయాలు అర్థం చేసుకోవాలి. ఇద్దరూ మాట్లాడుకొనేటప్పుడు ఒకరిని మరొకరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. రెండు వైపులా కుటుంబాలు, స్నేహితులు మొదలైన విషయాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి.
నాలుగవ సారి కలిసినప్పుడు బాధ్యతల గురించి, అంచనాల గురించి. ఆర్థిక విషయాల గురించ, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల గురించి. భాగస్వామికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి.. ఇలా అన్నీ తెలుసుకుంటూ ఉండాలి.
రెండు వైపులా కుటుంబాలు ముందే చెప్పకుండా కూడా ఒకరి కుటుంబాన్ని మరొక కుటుంబం కలవచ్చు. దీనివల్ల కుటుంబాల ప్రాధాన్యతలు అర్థం అవుతాయి. వివాహ బంధం కుదుర్చుకోవడానికి ఏదైనా సంశయం అనిపిస్తే ఎలాంటి మొహమాటానికి పోకుండా నిజాయితీగా సమస్యను చెప్పి సంబంధం విడిచిపెట్టడం లేదా.. సమస్య పరిష్కారానికి ముందే సరైన ప్రణాళిక చేయడం ముఖ్యం. ఇలా అన్ని విధాలా అన్ని సార్లు కలిసి మాట్లాడుకున్న తరువాతే సంబంధాలు ఖాయం చేసుకోవడం మంచిది. లేకపోతే నేటి కాలపు తొందరపాట్ల వల్ల పెళ్లి అనేది మూణ్ణాళ్ల ముచ్చట అవుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/be-care-full-of-arranged-marriage-35-193270.html












