ఉగ్గుపాల వంటి మాతృ భాషను మరవకూడదు..
Publish Date:Feb 21, 2025

Advertisement
మనం మాట్లాడటానికి భాష ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ వ్యక్తికీ మొదట పరిచయమయ్యేది మాతృభాషే. ఈ భాష ద్వారానే మనం మొదటిసారి మాట్లాడటం, వినటం, అర్థం చేసుకోవటం నేర్చుకుంటాం. మన అనుభవాలను, భావోద్వేగాలను వ్యక్తపరచగలుగుతాము. ఇది మన సంస్కృతిని, మూలాలను గుర్తుచేస్తుంది. అనుబంధాలను మరింత బలపరుస్తుంది. ప్రతి మనిషికి తన మాతృభాషంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కానీ నేటి కాలంలో పర బాషలు మాతృభాషను మసకబారేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంగ్ల భాష వల్ల జీవితం అభివృద్ది అవుతుందని, అందలాలు ఎక్కవచ్చని తలచి.. చిన్న పిల్లలకు ఉగ్గుపాల లాగా ఆంగ్లభాషను నేర్పుతున్నారు చాలామంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషా వైవిధ్యాన్ని, మాతృభాషా పరిరక్షణను ప్రోత్సహించేందుకు ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
ఈ దినోత్సవం ఎప్పుడు మొదలైంది..
మాతృభాషా దినోత్సవం 1999వ సంవత్సరంలో జరిగిన యునెస్కో జనరల్ కాన్ఫరెన్సు మీటింగులో ఆమోదించించబడింది. దీనికి బంగ్లాదేశ్ లో జరిగిన బంగ్లా భాషోద్యమం ప్రేరణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని 2000వ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు. ఇది 2025నాటికి 25వ వార్షికోత్సవ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోనుంది.
మమతల భాష..
మాతృభాష అనేది మన సంస్కృతి, సంప్రదాయాలు, జ్ఞానాన్ని తరతరాలకు అందించే సాధనం. అంతేనా మనిషికి మొదట మమతానురాగాలను పంచేది మాతృభాషే.. మాతృభాషలో చదువుకుంటే విషయాలను అర్థవంతంగా, సులభంగా గ్రహించగలం. దీన్ని కాపాడితేనే భవిష్యత్తు తరాలకు మన భాషను, సంస్కృతిని అందించగలుగుతాం. తక్కువమంది మాట్లాడే భాషలను, ఆదివాసీ భాషలను కాపాడకపోతే వారి జాతి, సంస్కృతి కూడా అంతమైపోతుంది. అందుకే ప్రతీ ఒక్కరు వారి మాతృభాషని రక్షించుకోవాలి. నేటి పిల్లలలో చాలామంది ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఆరాటంలో అది సరిగా నేర్చుకోలేక, ఇటు మాతృభాష కూడా చదవటం రాక ప్రశ్నార్ధకంగా మిగిలిపోతున్నారు. ప్రతీ మనిషికి ప్రాధమిక విద్య మాతృభాషలోనే జరిగితే వారి భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని చాలా పరిశోధనలు చెప్తున్నా కూడా ఇప్పటి వాళ్లు అర్ధం చేసుకోలేకపోతున్నారు. మాతృభాష అమ్మ మాటలాంటిది. మన మాతృభాషకి మర్యాదనిస్తూనే, ఇతరుల భాషని గౌరవించాలి.
భారతదేశంలోని భాషా వైవిధ్యం......
భారతదేశం అనేక భాషలకు పుట్టినిల్లు. ఇక్కడ 1,600 కంటే ఎక్కువ భాషలు, మాండలికాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో 22 భాషలు అధికారికంగా గుర్తించబడ్డాయి. హిందీ, బెంగాళీ, తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, మలయాళం, ఒడియా వంటి భాషలు ఎక్కువమంది మాట్లాడే భాషలుగా ఉన్నాయి. భారత ప్రభుత్వం తమిళం, సంస్కృతం, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన భాష హోదా కూడా ఇచ్చింది. తక్కువమంది మాట్లాడే భాషని, రాసే లిపిని, వారి సంస్కృతులని పరిరక్షించుకునే హక్కుని 29వ ఆర్టికల్ ద్వారా మన రాజ్యాంగం కల్పిస్తుంది. భాష సంరక్షణ పథకాల అమలు ద్వారా, ప్రాచీన భాషలకు గుర్తింపునివ్వటం ద్వారా, పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన చేయటం ద్వారా , భాష పరిశోధనని ప్రోత్సహించటం ద్వారా భాషలు అంతరించిపోకుండా కాపాడడం వీలవుతుంది. వివిధ భాషలను పరిరక్షించడం ద్వారా సమాజంలోని ప్రజలు ఒకరినొకరు గౌరవించే తత్త్వాన్ని అలవర్చుకుంటారు. ఇది అంతర్గత ఐక్యతని పెంపొందిస్తుంది.
తెలుగు భాష తీయదనం.....
తెలుగు భాషను "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా పిలుస్తారు. దీని మాధుర్యం, వ్యాకరణ పరిపుష్టత, ప్రాచీన సాహిత్య సంపద కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రాముఖ్యత కలిగిన ద్రావిడ భాష గానూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రధాన భాషగానూ ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది పైగా తెలుగు భాష మాట్లాడేవారున్నారు. ఇతర దేశాల్లో కూడా తెలుగు మాట్లాడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.
భాషా పరిరక్షణ, భాషా వైవిధ్యం, మాతృభాషల ప్రాముఖ్యతను గుర్తు చేయడమే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ లక్ష్యం. మాతృభాషను గౌరవించి, భవిష్యత్ తరాలకు అందించడం మన కర్తవ్యంగా భావించాలి. మన మాతృభాషను గౌరవిస్తూ, తద్వారా దేశ భాష వైవిధ్యాన్ని కూడా సంరక్షించాలి.
"భాష మన సంస్కృతికి ప్రతిబింబం" కాబట్టి మన భాషను కాపాడటం మన బాధ్యత!
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/international-mother-language-day-35-193215.html












