బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు శుభ పరిణామం : డిప్యూటీ సీఎం భట్టి
Publish Date:Oct 6, 2025
Advertisement
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంలో విచారణ సందర్బంగా ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి సుప్రీం కోర్టులో ఉన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం ఉందని భట్టి తెలిపారు. కొందరు దురుద్దేశంతో కావాలనే బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం హర్షణీయమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని డిప్యూటీ సీఎం దీమా వ్యక్తం చేశారు. మరోవైపు పీసీసీ చీప్ మహేష్ గౌడ్ స్పందిస్తూ.. సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని మహేష్ గౌడ్ అన్నారు.
http://www.teluguone.com/news/content/bc-reservations-36-207432.html





