బాబు నోట ముందస్తు మాట.. జగన్ మరో గత్యంతరం లేదని వ్యాఖ్య
Publish Date:May 17, 2022
Advertisement
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి నోట ముందస్తు ఎన్నికల మాట వచ్చింది. మహానాడు ఏర్పాట్ల సమీక్ష కోసం పార్టీ నేతలతో మంగళవారం సమావేశమైన చంద్రబాబు.. వైసీపీ సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిందన్నారు. తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న జన స్పందన, వైసీపీ గడప గడపకూ కార్యక్రమానికి ఎదురౌతున్న ప్రజా నిరసనలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇక ప్రభుత్వాన్ని నడిపే సత్తా జగన్ కు లేదని అందుకే ముందస్తుకు వెళ్లడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించే పరిస్థితి లేదనీ, అందుకే ముందస్తుకు వెళ్లక తప్పదనీ పరిశీలకులు ఇప్పటికే విశ్లేషణలు చేస్తున్న సంగతి విదితమే. గడప గడపకూ కార్యక్రమంలో పథకాల లబ్ధిదారులే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంఘటనలు ఎదురౌతున్న నేపథ్యంలో చంద్రబాబు మాటలు రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. జనం తమ కష్టాలు తీర్చేది తెలుగుదేశం పార్టీయే అని భావిస్తున్నారని చెప్పిన చంద్రబాబు మరింత దూకుడుగా ప్రజలలోకి వెళ్లి జగన్ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గడప గడపకూలో వైసీపీ నేతలను జనం నిలదీస్తున్న తీరు చూస్తుంటే.. జగన్ పాలన పట్ల ఎంతగా విసిగిపోయారో అవగతమౌతోందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న చంద్రబాబు అతి విశ్వాసం వద్దనీ, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. విమర్శించే వారిపై దాడులు, తెలుగుదేశం నాయకులకు బెదరింపులతో జగన్ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్న చంద్రబాబు వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందన్నారు. గుంటూరు జిల్లాలో వెంకాయమ్మపై దాడి, వైఎస్సార్ కడప జిల్లా తెలుగుదేశం కార్యదర్శి సాయినాథ్ శర్మకు బెదరింపులు, ఆయన కారు ధ్వంసం వంటి సంఘటనలు చంద్రబాబు మాటలలోని వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశ్నించే జనాలపై దాడులు, తెలుగుదేశం నేతలు, శ్రేణులకు బెదరింపులు, దాడులు ఏవో ఒకటి రెండు జిల్లాలకు పరిమితమై లేవనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనీ పరిశీలకలు సైతం చెబుతున్నారు. రోజు రోజుకూ ఆర్థిక పరిస్థితి దిగజారుతుండటం, పథకాలలో కొతలతో జనంలో ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు జగన్ పథకాలు పూర్తిగా నిలిచిపోకముందే ఎన్నికలకు వెళ్లడం మేలన్న భావనలో ఉన్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం జగన్ మదిలో ‘ముందస్తు’ ఆలోచన మెదులుతోందని సంకేతం ఇచ్చిన సంగతి విదితమే. అలాగే బీసీల ప్రయోజనాలను కాపాడటంలో చాంపియన్ అని చెప్పుకునేందుకే ఇప్పటి దాకా వారిని పట్టించుకోని జగన్ హఠాత్తుగా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా బీసీల ఓట్లకు గాలం వేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నోటి వెంట ముందస్తు మాట రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాదుడే బాదుడులో భాగంగా జిల్లాల పర్యటనల్లో చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక జగన్ కంచుకోటగా చెప్పుకునే ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనకు తెలుగుదేశం శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/babu-speaks-on-early-elections-says-jagan-has-no-alternative-25-136038.html





