బాదుడుపై టీడీపీ దూకుడు- బాబు జిల్లాల పర్యటనలు!
Publish Date:May 2, 2022
Advertisement
తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ధరల బాదుడుపై ఆందోళనా కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, స్వయంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల నాలుగు నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు బయలు దేరనున్నారు. నాలుగు నుంచి విడతల వారీగా మహానాడు వరకూ ఆయన ఈ పర్యటనలు కొనసాగించనున్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు ఆందోళనా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు. నాలుగో తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో ఆయన పర్యటిస్తారు, ఆ మరుసటి రోజు అంటే 5వ తేదీన భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో పర్యటిస్తారు, ఆరవ తేదీన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోరింగలో పర్యటిస్తారు. ఈ మూడు సందర్భాలలోనూ కూడా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇప్పటికే చంద్రబాబు వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని చెబుతున్న చంద్రబాబు, జగన్ సర్కార్ నిర్వాకాలపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కేడర్ కు పిలుపు నిచ్చారు. అలాగే ఏపీలో దారుణాలపై డీజీపీకి లేఖ రాశారు.
మే 28న ఒంగోలులో తెలుగుదేశం మహానాడు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్యాడర్ లో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ నింపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాట స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిరసన గళమెత్తిన వారిపై పోలీసులు, వైసీపీ శ్రేణులూ దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు జిల్లాల పర్యటన పార్టీ క్యాడర్ లో ధైర్యాన్ని నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించే వారికి తెలుగుదేశం పార్టీ అండ ఉంటుందన్న భరోసాను ప్రజలకు చంద్రబాబు తన పర్యటనల ద్వారా ఇవ్వనున్నారని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ ధరల బాదుడుకు గురౌతున్నారనీ, ప్రభుత్వ అసమర్ధ, అస్తవ్యస్థ విధానాలే రాష్ట్రంలో ధరల బాదుడుకు కారణమని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడానికి చంద్రబాబు జిల్లా పర్యటనలు దోహదపడతాయని చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనలతో పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం నిండటం ఖాయమని అంటున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా జగన్ ఇంకెంత మాత్రం ఉచిత పథకాలు కొనసాగించలేని పరిస్థితి ఉందనీ, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్, ఉచితాలు నిలిపివేసి మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ముందే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న రాజకీయ పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడం కూడా బాబు పర్యటనలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
http://www.teluguone.com/news/content/babu-district-tours-aganst-jagan-government-atrocities-25-135356.html