ఈ ఐదుగురిని పొరపాటున అవమానించారంటే.. జీవితంలో విజయం అనేది ఎప్పటికీ అందుకోలేరు..!
Publish Date:Apr 15, 2026
Advertisement
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు. అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. చేసే కొన్ని తప్పులు వారికి ఎలాంటి విజయాన్ని ఇవ్వవు అని చెబుతాడు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. వేల సంవత్సరాల కిందటే.. మనిషి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, ఆర్థిక సూత్రాలను ప్రపంచానికి అందించాడు. అవి ఇవ్పటికీ ప్రజలు ఆచరించే విధంగా ఉన్నాయంటే.. ఆయన ఆలోచన, ఆయన సిద్దాంతాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో.. సమాజంలో ఉండే కొందరు వ్యక్తులను అవమానించడం వల్ల ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును చీకటిలోకి నెట్టుకున్నట్టు అవుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐదుగురు వ్యక్తులను అవమానించడం వల్ల జీవితంలో అసలు విజయాన్ని సాధించలేరని కూడా చెబుతాడు. ఇంతకీ ఎవరిని అవమానించకూడదు? ఎందుకు అవమానించకూడదు? తెలుసుకుంటే.. గురువు.. చాణక్య నీతి ప్రకారం గురువు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు, ఎందుకంటే గురువు అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాడు. గురువు మనకు అక్షరాస్యతను అందించడమే కాకుండా, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి విలువలు కలిగి ఉండాలో.. ఆ విలువలను నేర్పుతాడు. తమ గురువును లేదా మార్గదర్శకుడిని అగౌరవపరిచిన వారు తమ జ్ఞానాన్ని, విజయాన్ని కోల్పోతారని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. తల్లిదండ్రులను.. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్ప శ్రేయోభిలాషులు ఉండరు. తండ్రి కుటుంబానికి రక్షణ కవచం అయితే, తల్లి విలువలకు, ప్రేమకు ప్రతిరూపం. తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించే లేదా వారిని అగౌరవపరిచే పిల్లలు అదృష్టాన్ని, సంతోషాన్ని కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని ప్రకారం, పెద్దల కళ్లలో కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదట. పండితులు.. చాణక్య నీతి ప్రకారం సమాజంలో అపారమైన అనుభవం, బోలెడు జ్ఞానం ఉన్నవారే పండితులు. అలాంటి పండితుల సాంగత్యం అమూల్యమైనది. పండితులను ఎగతాళి చేయడం లేదా కించపరచడానికి ప్రయత్నించడం మేధో దారిద్య్రాన్ని ప్రతిబింబిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. పండితులను అవమానించడం ద్వారా, సరైన సలహా, మార్గదర్శకత్వం పొందే అవకాశాలను కోల్పోయి, చివరికి పతనానికి గురవుతారట. కష్టపడి పనిచేసేవారు, సేవాభావం గలవారు.. ఆచార్య చాణక్యుడు ఎల్లప్పుడూ కష్టానికి గౌరవం ఇవ్వాలని బోధించారు. పారిశుధ్య కార్మికుడైనా, సెక్యూరిటీ గార్డు అయినా, కూలీ అయినా.. సమాజాన్ని నడిపించడానికి కష్టపడే ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులు. ఒకరి ఆర్థిక స్థితి లేదా హోదాను బట్టి వారిని అవమానించడం మనిషిలో అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి ప్రతికూల శక్తే ఉంటే.. అదే వారి దురదృష్టానికి అతిపెద్ద కారణం అవుతుంది. సాధు స్వభావం ఉన్నవారు.. ధర్మం, సత్యం, నైతికత మార్గాన్ని అనుసరించేవారిని అసంతృప్తికి గురిచేయడం, అవమానించడం చాలా తప్పు. సద్గుణ, సత్ప్రవర్తన గలవారు ఎవరికీ కీడు కోరుకోరు, కానీ వారిని అవమానించడం జీవితంలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. మానసిక సమతుల్యత కావాలన్నా, ఇంట్లో శాంతికి లోటు ఉండకూడదన్నా సాధు స్వభావం గల వారిని గౌరవించడం చాలా అవసరం. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/avoid-insulting-these-5-people-at-all-costs-35-217418.html




