మోదీ బంగారు పుట్టలో వేలు పెట్టబోతున్నాడా?
Publish Date:Dec 1, 2016
Advertisement
నోట్ల రద్దు... 500, 1000 రూపాయల నోట్లు... కొత్త 2వేల నోటు... బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ... చిల్లర కష్టాలు! ఈ మాటలు విని విని కాస్త అలవాటు పడిపోయిన వారికి బంగారం అంటూ బాంబు లాంటి వార్త తీసుకొచ్చింది మీడియా! మోదీ బంగారంపై కన్నేశాడు. మోదీ సర్కార్ ఇకపై మీరు స్వేచ్ఛగా బంగారం కొనుక్కునే ఛాన్స్ లేకుండా చేసేస్తోంది! ఇంచుమించూ ఇలాంటి మీనింగ్ వచ్చేలా న్యూస్ వచ్చేసింది! ఇంతకీ నిజంగా మీ ఇంటిలోని, ఒంటిపైని బంగారంపై సర్జికల్ స్ట్రైక్స్ జరగనున్నాయా? కానే కాదు...
కేంద్ర ఆర్దిక శాఖ ఇచ్చిన క్లారిటీ ప్రకారం బంగారం కొనుగోలుపై ఎలాంటి అడ్డూ లేదు. కాకపోతే, మీరు ఎంత బంగారం కొన్నా ఆ బంగారం వైట్ మనీతోనే కొన్నారని ఆధారం చూపించాలి! అంటే మీరు బంగారం కొన్న డబ్బుకి ట్యాక్స్ కట్టారనుకోండి... ఇక బంగారంపై ఎలాంటి అంక్షలు వుండవు. అంతే కాదు, వివాహం అయిన స్త్రీలకు అరకిలో వరకూ బంగారం వున్నా ఎలాంటి లెక్కలూ అడగదు ప్రభుత్వం. పెళ్లి కాని మహిళలకు 250గ్రాముల దాకా నో కండీషన్స్. ఆ తరువాత ప్రతీ గ్రాముకు గవర్నమెంట్ కు లెక్క చెప్పాలి. అయితే, దీన్ని సాధారణంగా నల్ల డబ్బు లేని జనం తమ కష్టార్జితంతో చట్టబద్ధంగానే కొంటారు కాబట్టి వాళ్లకి నో టెన్షన్!
మగవారికి బంగారం వంద గ్రాముల వరకూ వుండ వచ్చు! అంటే పది తులాలన్నమాట. ప్రస్తుత ట్రెండ్ లో మగవాళ్లు అంతకంటే ఎక్కువ బంగారం సాధారణంగా వేసుకోరు. ఒకవేళ వేసుకోదలిస్తే కొన్న బంగారం ఏ ఆదాయంతో ఖరీదు చేశారో స్పష్టంగా చెప్పాలి. ఆ డబ్బు వైట్ మనీ అయితే మిమ్మల్ని అడ్డుకునే వారు ఎవ్వరూ వుండరు!
మొత్తం మీద ఆర్దిక శాఖ ఇప్పుడు కొత్తగా బంగారం మీద అంక్షలేమీ తీసుకురాలేదని చెబుతోంది. గతంలోనూ పన్ను చెల్లిచని డబ్బుతో భారీగా బంగారం కొని దాచేస్తే నేరమే. ఇప్పుడూ అలాగే పరిగణిస్తారు. అయితే, పెద్ద నోట్లు రద్దు తరువాత చాలా మంది తమ కరెన్సీని కనకంగా మార్చేశారు. వాళ్లకే ఇప్పుడు కొంప మునిగేది. ప్రభుత్వం అడిగినప్పుడు బంగారం ఎలా వచ్చిందో చెప్పగలిగే నిజాయితీ కలిగిన మధ్య తరగతి, పేద జనాలకి ఎలాంటి హానీ వుండబోదు! అదీ విషయం...
http://www.teluguone.com/news/content/arun-jaitely-45-69750.html





