ఏపీలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
Publish Date:Jan 15, 2025
Advertisement
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక భయంలో బతికారు. జగన్ అరాచక పాలనలో ఏ వర్గమూ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించ లేని పరిస్ధితి ఉంది. ఇష్టారీతిగా దోపిడీ, దౌర్జన్యాల పర్వం సాగింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాయాన్ని మూటగట్టుకుని గద్దె దిగడం, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోంది. ప్రజల ప్రయోజనాలు, సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతున్నది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ఏదో నామ్ కే వాస్తే అన్నట్లుగా జరిగిన సంక్రాంతి సంబరాలు ఈ సారి మిన్నంటాయి. సంక్రాంతి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల రంగవల్లులతో కళకళలాడే లోగిళ్లు, గొబ్బెమ్మలు. ఇవన్నీ ఈ ఏడాది మరింత కళకళలాడాయి. పండుగ మూడు రోజులూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి.
వీటిని తిలకించడానికి లక్షల సంఖ్యలో అతిధులు వచ్చారు. ఏటా తెలుగు లోగిళ్లలోని సంక్రాంతి సంబురాలు, కోడి పందేలను తిలకించడానికి వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి జనం తరలి వచ్చే వారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య లక్షల్లో ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఈ సారి వారి స్వగ్రామాలకు కుటుంబ సమేతంగా తరలిరావడమే కాకుండా వారితో పాటు వారి స్నేహితులను కూడా తీసుకువచ్చారు. ఇలా వచ్చే అతిథుల విడిది కోసం స్థానికులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటువంటి పరిస్థతి ఇదే తొలిసారని చెబుతున్నారు.
సంక్రాంతి అనగానే కోడి పందేలు వేయడం, పోలీసులు రావడం, పందేలు వేసే వారిని, పై పందేలు కాసే వారిని తరిమి పట్టుకోవడం ఇప్పటి వరకు చూశాము. ఈ సారి పోలీసులు కోడి పందేల బరుల వద్ద కనిపించలేదు. పండుగ ముందు కొన్ని ప్రాంతాలలో పోలీసులు ఒకింత హడావుడి చేసినా పండుగ రోజుల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ సారి గతానికి భిన్నంగా కోడి పందేలను తిలకించేందుకు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రావడం విశేషం. కొన్ని చోట్ల వారు కూడా పందేలలో పాల్గొన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు కోడి పందేల బరుల నిర్వాహకులుగా మారారు. వీరు బరులు ఏర్పాటు చేస్తే మగవారు నిర్వహణ బాధ్యతలు చూశారు. కోడి పందేల బరులతో పాటు చాలా గ్రామాల్లో రికార్డింగ్ డ్యాన్స్ లు హోరెత్తాయి. రాయలసీమ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు చేసేందుకు వెళ్లారు. ఉమ్మడి అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో వెళ్లారు.
http://www.teluguone.com/news/content/ap-sankrati-celebrations-like-never-before-39-191331.html