పీపీపీ ప్రాజెక్టుల్లో ఏపీ నంబర్ వన్.!
Publish Date:Jul 31, 2026
Advertisement
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన మూడేళ్ల జాతీయ పీపీపీ ప్రాజెక్టుల పైప్‌లైన్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలో 1.16 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 270 ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయని కేంద్ర నివేదిక పేర్కొంది. భారీ ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, మౌలిక రంగాన్ని పరుగులు పెట్టించడంలోనూ ఏపీ సాధించిన ఈ ఘనత రాష్ట్ర ఆర్థిక పురోగతికి సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర శాఖలతో పాటు వివిధ రాష్ట్రాల్లో మొత్తం రూ. 17 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన 852 పీపీపీ ప్రాజెక్టుల ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో రాష్ట్రాల పరంగా అత్యధిక ప్రాజెక్టులు, భారీ పెట్టుబడులను దక్కించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా నిలిచింది. ఆ తరువాతి స్థానంలో తమిళనాడు 87 వేల 639 కోట్ల విలువైన ప్రాజెక్టులతో రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 65 వేల 496 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటినీ వెనక్కినెట్టి ఏపీ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. కేంద్ర మంత్రిత్వ శాఖల వివరాల ప్రకారం, మొత్తం 852 ప్రాజెక్టులలో ఎనిమిది ప్రధాన కేంద్ర శాఖల ఆధ్వర్యంలో రూ. 13.15 లక్షల కోట్ల వ్యయంతో 232 భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి. మిగిలిన 620 ప్రాజెక్టులను రూ. 3.84 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 20 విభిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పీపీపీ విధానంలో అమలు చేయనున్నాయి. రాష్ట్రాల వాటాలో లభించిన మొత్తం నిధులు, ప్రాజెక్టులలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ ఖాతాలోనే పడటం ద్వారా రాష్ట్ర వ్యూహాత్మక ప్రాధాన్యత మరోసారి రుజువైంది. ఈ మూడేళ్ల పీపీపీ ప్రణాళికలో రవాణా, లాజిస్టిక్స్, ఇంధన రంగం, సామాజిక , వాణిజ్య మౌలిక వసతులు, నీటి సరఫరా , పారిశుధ్య రంగాలు ప్రాధాన్యతగా ఉన్నాయి. మొదటి ఏడాదిలో రవాణా, లాజిస్టిక్స్ తో పాటు సామాజిక, వాణిజ్య విభాగానికి సంబంధించిన ప్రాజెక్టులు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో నీటి పారుదల, తాగునీటి సరఫరా, పట్టణ పారిశుధ్యం, క్లీన్ ఎనర్జీ రంగాల్లో వి అభివృద్ధి పనులను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా వేగవంతం చేసేలా కార్యాచరణను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘమైన సముద్ర తీరం, పారిశ్రామిక కారిడార్లు మరియు అభివృద్ధికి అనుకూలమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉండటం వల్ల ప్రైవేట్ పెట్టుబడిదారులు ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పీపీపీ నమూనా ద్వారా ప్రభుత్వంపై నేరుగా పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, ప్రైవేట్ సంస్థల సాంకేతిక నైపుణ్యాన్ని, మూలధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారుల కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ పార్కులు, వైద్య రంగానికి పీపీపీ మోడల్ ప్రధాన చోదక శక్తిగా మారింది. రాబోయే కాలంలో ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్‌డీపీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు రూపుదిద్దుకోనున్నాయి. విమానాశ్రయాలు, రోడ్ల విస్తరణ, రవాణా కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు కొత్త పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రంలో స్థానిక వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి. భూ లభ్యత, నిలకడైన విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చర్యల ద్వారా పీపీపీ ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది. నిర్ణీత కాలపరిమితిలోగా ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపాంతరం చెందుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Andhra Pradesh PPP Projects, AP Infrastructure Investments, Union Finance Ministry PPP Pipeline. Andhra Pradesh Economic Development
http://www.teluguone.com/news/content/ap-number-one-in-ppp-projets-36-227650.html





