టీటీడీకి హైకోర్టు షాక్.. వారిని బోర్డు నుంచి తొలగించాలని ఆదేశం
Publish Date:Mar 31, 2022
Advertisement
పాలించేవారే నేరచరితులైతే.. ఇక వ్యవస్థలన్నీ నేరచరితులతో నిండిపోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది. ఏపీలో అలాంటిదే జరుగుతోంది. తన వారిని అందలం ఎక్కించే ఉద్దేశంతో.. అర్హత లేనివారికీ పట్టం కట్టేస్తున్నారు పాలకులు. రాజు తలుచుకుంటే.. రూల్స్ అడ్డు వస్తాయా? అయితే, తమను అడిగే వారు లేరనుకోవడం పొరబాటు. ప్రశ్నించే గొంతుక.. ఎప్పుడూ న్యాయ పోరాటం చేస్తూనే ఉంటుంది. తాజాగా, టీటీడీ బోర్డులో నేరచరితులపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అలాంటి వారిని వెంటనే తొలగించాలంటూ టైమ్ బౌండ్ పెట్టి మరీ ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ పెద్దల్లో కలకలం చెలరేగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.... నేర చరిత్ర గల వారికి టీటీడీ బోర్డు సభ్యుడి పదవి ఇవ్వడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు సభ్యులుగా నేరచరిత్ర ఉన్న వారిని నియమించారంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు వివరాలను సీజే ధర్మాసనం పరిశీలించింది. నేరచరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని హైకోర్టు కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. పిటిషనర్ వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్టు భావిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. అందరినీ తొలగించకపోయినా, కొందరినైనా తొలగించాలని సూచించింది. ‘‘టీటీడీ భవనం కలెక్టరేట్ అవసరాలకు వాడుకుంటే విధానపరమైన నిర్ణయం కాబట్టే సమర్థించాం. కానీ, నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండకూడదు. ఏప్రిల్ 19న కేసు వాదనలు వింటాం. అదే రోజు నిర్ణయం. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవు.’’ అని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
http://www.teluguone.com/news/content/ap-high-court-on-ttd-board-members-25-133769.html





