36 గంటల తర్వాత ఆర్కేపై ఎఫ్ఐఆర్! ఏపీ సీఐడీ తీరుపై న్యాయ నిపుణుల విస్మయం..
Publish Date:Dec 13, 2021
Advertisement
ఏబిన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రచ్చవుతోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. ఈ కేసు విషయంలో వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల సందర్భంలో విధులకు ఆటంకం కలిగించారంటూ రాధాకృష్ణతో సహా నలుగురిపై ఐపీసీ 353, 341, 186, 120(బి), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. తన చిరకాల మిత్రుడు లక్ష్మీనారాయణను పరామర్శించేందుకు ఆర్కే అక్కడికి వెళ్లారు. అయితే రాధాకష్ణను కొద్దిసేపు ఇక్కడే ఉండాలని సీఐడీ అధికారులే కోరారని తెలుస్తోంది. అంతేకాదు మీరు ఇక్కడే ఉంటే లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు సహకరిస్తారని కూడా సీఐడీ కోరిందని సమాచారం. ఈ క్రమంలో అధికారులకు అన్ని విధాలా సహకరించాలని కూడా రిటైర్డ్ ఐఏఎస్ కుటుంబీకులకు ఆర్కే సూచించారు. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమోకానీ ఒక్కసారిగా సీఐడీ అధికారులు ప్లేట్ మార్చేశారు. విచారణకు ఆటంకం కలిగించారంటూ 36 గంటల తర్వాత ఏబీఎన్ ఎండీపై కేసు నమోదు చేశారు. ఏపీ ప్రభుత్వ లోపాలను ప్రసారం చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దురుద్దేశంతోనే సీఐడీ పోలీసులు జీరోఎఫ్ఐఆర్ నమోదు చేశారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. గంటా లక్ష్మీనారాయణ ఇంటికి ఆర్కే స్నేహ పూర్వకంగానే వెళ్లడం జరిగిందని, సీఐడీ అధికారుల విధులకు ఎక్కడా ఆటంకం కలిగించినట్లు లేదన్నారు. రాధాకృష్ణపై కేసు పెట్టడం సీఐడీకి మాయని మచ్చని టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అవినీతి, అక్రమాలు బయటపెట్టం వల్లే ప్రభుత్వం కక్ష్య కట్టిందని ఆరోపించారు. రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ కేసు చివరకు జీరో గానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.
విచారణ సమయంలో ఆర్కేని అక్కడే ఉండాలని కోరడమేంటి..? 36 గంటల తర్వాత మళ్లీ ఇలా కేసు నమోదు చేయడమేంటి..? ఇదేం విచిత్రమో అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు, నిపుణులు, విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిజంగా ఆర్కే విచారణను అడ్డుకుని ఉంటే అప్పుడే హైదరాబాద్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? ఇది కచ్చితంగా ఆర్కేపై కక్షసాధింపు చర్యేనని రాజకీయ ప్రముఖులు సీఐడీ తీరును తప్పుబడుతున్నారు. విచారణకు అడ్డుకుని ఉంటే అదే సమయంలో. లేదా అదే రోజు సాయంత్రం వరకో.. అదీ కాకుంటో ఆ మరుసటి రోజో ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది ప్రశ్నగా మారింది.
http://www.teluguone.com/news/content/ap-cid-xero-fir-on-abn-md-vemuri-radha-krishna-39-128250.html





