వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కార్యాలయంలో కిరణ్ తో కార్యకర్తల సమావేశం!
Publish Date:Jun 11, 2012
Advertisement
ఒకప్పుడు అది కాంగ్రెస్ కార్యాలయం. కానీ ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యాలయం. రెండు పార్టీల కార్యాలయంగా రంగులు మార్చుకున్నది మాత్రం ఒక్కటే భవనం. అదీ నర్సాపురంలోని ఇండిపెండెన్స్ మెమోరియల్ భవనం. ఎన్నికల పర్యటనలో భాగంగా ఇక్కడకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది తమ కాంగ్రెస్ కార్యాలయం అంటూ సమావేశాన్ని నిర్వహించి ఈ భవన సమస్యను జటిలం చేశారు. దీంతో మండిపడ్డ లీజుదారుడైన నర్సాపురం తాజామాజీ, వై.కా.పా. అభ్యర్థి ప్రసాదరాజు పోలీసులను ఆశ్రయించారు. కాంగ్రెస్ నేతలపై ఆయన పోలీసుకేసు పెట్టారు. ఇప్పుడు రెండు పార్టీలనూ కాదని ఆ కార్యాలయం పోలీసు పహారాలో ఉన్నది. అంతేకాకుండా ఈ భవనం వద్ద 144 సెక్షన్ విధించారు.
నర్సాపురంలోని ఇండిపెండెన్స్ మెమోరియల్ భవనాన్ని మడునూరి ప్రసాదరాజు తన కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. దీంతో ఆ భవనానికి కాంగ్రెస్ గుర్తింపునందుకుంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టినప్పుడు ప్రసాదరాజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. ఆ వెంటనే కాంగ్రెస్ బోర్డు తీసేసి రంగులు మార్చేసి అదే కార్యాలయాన్ని వై.కా.పా. కార్యాలయంగా ప్రసాదరాజు మార్చేశారు. అనంతరం ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల ప్రచారానికి ఇటీవల నర్సాపురం వచ్చిన ముఖ్యమంత్రి తమ కార్యాలయాన్ని వై.కా.పా. కార్యాలయంగా మార్చేశారని పితాని , ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో అసలు విషయం తెలుసుకోకుండానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ కార్యాలయానికి వచ్చి పనిలో పనిగా అక్కడే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం తిరిగి తన ప్రచారంలో భాగంగా మరో ప్రాంతానికి సిఎం వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వై.కా.పా. నేతలు, ప్రసాదరాజుకు సమాచారం ఇచ్చారు.
తాను లీజు తీసుకున్న భవనంపై కాంగ్రెస్ పెత్తనమేమిటని ఆగ్రహించిన ప్రసాదరాజు మంత్రి పితాని, ఎమ్మెల్యే కారుమూరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పై దౌర్జన్యం చేసి లీజు తీసుకున్న కార్యాలయాన్ని లాక్కున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి, ఎమ్మెల్యే తనపై కూడా దౌర్జన్యం చేశారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని మరో నాయకుడు పాలపర్తి బోసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ప్రసాదరాజుకు భవనాన్ని లీజుకు ఇచ్చామని ఇండిపెండెన్స్ బిల్డింగ్ సంఘం ఉపాధ్యక్షుడు పాలంకి ప్రసాద్ స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/ap-byelections-24-14782.html





