ఏపీ, తెలంగాణలో బడ్జెట్ బెల్.. సభాసమరానికి ముహూర్తం ఫిక్స్..
Publish Date:Feb 28, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీన ఒకే రోజు ప్రారంభం అవుతాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల అయింది. అయితే.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ తేదీపై మాత్రం ఒక ప్రకటన వచ్చింది. మార్చి 7వ తేదీ ఉదయం 11.30 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల నుంచి సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన పూర్తి ప్రకటన త్వరలోనే విడుదల అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్లను ఈ సమావేశాల్లోనే ఇరు ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి. ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను మార్చి 11న లేదా 14వ తేదీన ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏపీ బడ్జెట్ సమావేశాలు మూడు వారాల పాటు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే.. ఈ విషయం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. ఇటీవలే గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆ మరుసటి రోజున సభ సంతాపం తెలుపుతుంది. 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. మార్చి 11న లేదా14న ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సారి ఏపీ వార్షిక బడ్జెట్ సుమారు 2.30 లక్షల కోట్లతో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ పై ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని శాఖల కసరత్తు ఇంచుమించుగా పూర్తయింది. ఈసారి బడ్జెట్ లో విద్య, వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోందట. వ్యవసాయం, పాడి పరిశ్రమపైన కూడా బడ్జెట్ దృష్టి సారిస్తుందని అధికార వర్గాల నుంచి సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లుతో పాటు మరికొన్నికీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.
http://www.teluguone.com/news/content/ap-and-telangana-assembly-budget-sessions-39-132398.html





