మరో ఏడుగురు ఐఎఎస్ ల అరెస్టు తప్పదా?
Publish Date:May 21, 2012
Advertisement
ఎమ్మార్, జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం మైనస్ కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా జి.వో.లు జారీ చేశారన్న ఆరోపణలపై రాష్ట్రానికి చెందిన మరో ఏడుగురు ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లను సిబీఐ అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే సీనియర్ ఐఎఎస్ బిపి ఆచార్, వు శ్రీలక్ష్మీ జైలులో ఉన్నారు. వీరుకాక మరో ఏడుగురు ఐఎఎస్ అధికారులకు కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు సిబీఐ నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. వై.ఎస్. హయాంలో మౌలికసదుపాయాలూ, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్, రెవెన్యూ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎస్,శామ్యూల్, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జె.ఎస్.వి. ప్రసాద్, రెవెన్యూ రిజిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కె.రత్నప్రభ, మున్సిపల్, పట్టణాభి వృద్ధిశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ డాక్టర్ పి.వీ.ఎస్.కె.శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జి.శ్యాంబాబు పై సిబీఐ త్వరలోనే కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలిసింది. జగన్ పై దర్యాప్తు ముమ్మరం చేసిన తరుణంలో తాజాగా ఈ ఏడుగురు ఐ.ఎ.ఎస్. అధికారులను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి ఇస్తే అది ఈ ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారగలదని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. నేరస్తులు ఎంతటి వారైనా తమ ప్రభుత్వం ఉపేక్షించదనే భావన ప్రజల్లో కలిగించాలని కిరణ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఐ.ఎ.ఎస్.ల ప్రాసిక్యూషన్ ఫైలుపై సంతకాలు చేసి ఢిల్లీ పంపి అనుమతులు వచ్చేలా చూడాలనుకున్నట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/another-7-ias-officers-to-be-arrested-24-14171.html





